News

విస్తరణ, సంఘటితంపైనే ఎప్పుడూ దృష్టి పెడతాం : అరుణ్ కుమార్

347views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు బెంగళూరు వేదికగా రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ABPS లో ఆమోదించబడిన తీర్మానాలను కూడా విలేకరులకు వివరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎల్లప్పుడూ విస్తరణ, సంఘటితంపైనే దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తామని, దీనిపై మూల్యాకనం కూడా చేసుకుంటామని తెలిపారు. నిజమైన సామాజిక పరివర్తన అనేది చట్టాల ద్వారా మాత్రమే సాధించబడదని, దీనికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.

సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రాథమిక లక్ష్యమని, సంఘ్ ను కేవలం ఓ సంస్థగా కాకుండా, పరివర్తనకు అంకితమైన ప్రజల ఉద్యమంగా తాము భావిస్తున్నామని అన్నారు.

గత 100 సంవత్సరాలుగా తాము విస్తరణ, సంఘటన అన్న రెండు కీలక అంశాలపై శ్రద్ధగా చర్చిస్తూ, విశ్లేషించుకుంటున్నామని, ఇవే సామాజిక పరివర్తనకు దోహదపడతాయన్నారు. అయితే సంఘ శతాబ్ది ఉత్సవాల సమయంలో పురోగతిని అంచనా వేయడం, ప్రయత్నాలను వేగవంతం చేయడం అత్యంత సహజమైన చర్య అని అన్నారు. అలాగే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం అని కూడా అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ఆరు సంవత్సరాల క్రితం తాము నిర్దిష్టమైన లక్ష్యాలను గుర్తించామని, వాటిపై తగిన వార్షిక సమీక్షలు నిర్వహిస్తున్నా… సంఘ్ శతాబ్ది ఉత్సవాల సమయంలో ఆ లక్ష్యాల పురోగతిని అంచనా వేసుకోవడానికి తగిన సందర్భమిదేనని అన్నారు. సంఘ విస్తరణ,గుణాత్మక వికాసం, సుప్తశక్తి జాగరణ అన్న మూడు కీలక అంశాలపై దృష్టి నిలిపామని తెలిపారు.

‘‘ప్రతి స్వయంసేవక్ కూడా చురుకైన కార్యకర్తగా వుండాలని కోరుకుంటున్నాం. నిన్న ముకుంద్ జీ చెప్పినట్లుగా మాకు కోటి మంది స్వయంసేవకులు వున్నారు. అందులో 60 లక్షలకు పైగా నిరంతరం, అప్రతిహతంగా మా కార్యవిస్తరణలో పాల్గొంటున్నారు. సుమారు 8 లక్షల మంది సంస్థాగత బాధ్యతల్లో వున్నారు. దైనందిన కార్యక్రమాల్లో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనేలా మేము ప్రోత్సహిస్తున్నాం. ఆర్థిక, సామాజిక, విద్యా, మేధోపరమైన రంగాలతో పాటు సామాజిక రంగాల్లోని ప్రతిష్ఠిత వ్యక్తులతో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తామని, వీరంతా దేశ క్షేమం కోసం మా దార్శనికతను పంచుకుంటారు. మేము వారి నుంచి నిరంత సహకారం కోసం ప్రతయ్నాలు చేస్తాం. దీనికి సంబంధించిన కార్యకలాపాల ప్రణాళికను చేశాం’’ అని అరుణ్ కుమార్ తెలిపారు.అలాగే ఈ సమావేశాల్లో సంఘ శతాబ్ది సందర్భంగా తమ కార్యకలాపాలపై కూడా చర్చించామని, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పాత్ర, బాధ్యతలకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించాం’’ అని తెలిపారు.

1925 లో సంఘ్ స్థాపన జరిగిందని 1940 నాటికే దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించామన్నారు. అలాగే 1972 నాటికి అన్ని జిల్లాలకు 1996 నాటికి అన్ని బ్లాకులకు, పట్టణాలకు చేరుకున్నామన్నారు. ప్రస్తుతం నూటికి నూరు శాతం ప్రాంతాలకు చేరుకుంటున్నామని వివరించారు.

మండలాలు, బస్తీ స్థాయిల్లో కూడా భౌగోళికంగా విస్తరించడానికి తగిన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, సర్వ వ్యాపి, సర్వ స్పర్శి లాగా… అన్ని ప్రాంతాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఫలితాలకు దగ్గరగా చేరుకుంటున్న కొద్దీ… మరింత నేర్చుకుంటామన్నారు. ప్రారంభంలో తాము కళాశాలల్లో పనిచేయడంపై దృష్టి పెట్టామని తర్వాత నిర్దిష్టమైన ప్రదేశాలు పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు పని ప్రారంభమైపోయిందని,విస్తరిస్తున్నామని కూడా ప్రకటించారు.

సంఘ్ అనేది పరిష్కారాల ఆధారితమైన భూమికను కలిగి వుంటుందని, సామాజిక సమస్యలను గుర్తించి, వాటిని మరింత జటిలం చేయకుండా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. సమాజం శక్తి అత్యంత అపారమైందని, గత వంద సంవత్సరాలలో సంఘ విస్తరణ గురించి మాట్లాడేటప్పుడు కేవలం సంఖ్యా బలం గురించి మాత్రమే కాకుండా.. సమాజ బలాన్ని కూడా చెబుతూ వస్తున్నామన్నారు. సంఘ శక్తి పెరిగిందని చెప్పినప్పుడల్లా దాని అర్థం సామాజిక బలం పెరిగిందని, సవాళ్లను సమాజం ఎదుర్కోగలదన్నదే దీని అంతరార్థమని వివరించారు. ఈ అంతరార్థాన్ని ఆధారంగా చేసుకొనే.. ఈ సమావేశాల్లో తమ కార్యాన్ని సమీక్షించుకుంటున్నామని తెలిపారు. మరోవైపు ప్రతి ప్రాంతంలో జరుగుతున్న పనులు, ఆదర్శవంతమైన పనులపై ఈ సమావేశాల్లో నివేదికలు సమర్పించారని పేర్కన్నారు.

సమాజ అభివృద్ధి కోసం తాము చాలా చేశామని, ఇంకా చేయాల్సి వుందని కూడా అరుణ్ కుమార్ ప్రకటించారు. వంద సంవత్సరాలలో చాలా సాధించామని, ఇంకా సాధించాల్సి వుందన్నారు. అయితే.. ఇది కేవలం సంఘ బాధ్యత మాత్రమే కాదని, సమాజంపై కూడా ఈ బాధ్యత వుందని గుర్తు చేశారు.

భారత దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వుందని, ఇక్కడ అనేక భాషలు వున్నాయి కానీ.. భావన మాత్రం ఒక్కటేనని పునరుద్ఘాటించారు. ఏ మహా పురుషుడు కూడా కేవలం తన రాష్ట్రం గురించి మాత్రమే ఆలోచించలేదని ఎప్పుడూ జాతీయ దృక్పథంతోనే వారి ఆలోచన ధార వుండేదన్నారు. ఆహారపు అలవాట్లు వేర్వేరుగా వున్నా… సంస్కృతి, నాగరికత మాత్రం ఒక్కటేనన్నారు.

ఇక… బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై నిరంతరాయంగా జరుగుతున్న హింస, అన్యాయం, అణచివేతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ‘‘మైనారిటీ ఛాందసుల శక్తులు ప్రణాళికా బద్ధంగా హింస చేస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు హిందువులపై జరుగుతున్న అమానవీయ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించే బాధ్యతను తీసుకోవాలని ABPS అభిప్రాయపడింది. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, హింసాత్మక కార్యకలాపాలు నిలిపేసేలా ఒత్తిడి తేవాలని కూడా కోరింది.

హిందువులపై, మైనారిటీపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని పేర్కొంది. అలాగే అక్కడ వుండే మఠాలపై, దేవాలయాలపై, దుర్గాపూజ మండపాలపై, విద్యా సంస్థలపై, విద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దేవతలను అపవిత్రం చేయడం, అనాగరిక హత్యలు, ఆస్తులను దోచుకోవడం, మహిళలను అపహరించడం , వేధించడంతో పాటు బలవంతపు మత మార్పిళ్లు కూడా జరిగాయని పేర్కొంది.

ఈ సంఘటనలకు రాజకీయ ఉద్దేశాన్ని ఆపాదిస్తే.. మతపరమైన కోణాన్ని, సత్యాలను తిరస్కరించినట్లేనని అభిప్రాయపడింది. ఈ ఘటనల్లో ఎక్కువ మంది హిందువులు, మైనారిటీలే బాధితులని సభ వివరించింది. అయితే.. బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు మతతత్వ ఇస్లామిక్ శక్తుల చేతుల్లో హింసింపబడటం కొత్తేమీ కాదని తెలిపింది.

బంగ్లాదేశ్ లో హిందూ జనాభా నిరంతరం తగ్గుతోందని, (1951 లో 22 శాతం వుంటే..ఇప్పుడు 7.95 శాతం) తెలిపింది. అయితే.. తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల వెనుక ప్రభుత్వ మద్దతుతో పాటు సంస్థాగత మద్దతు కూడా ఇస్లామిక్ ఛాందసులకు వుందని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ఇలాంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఒక దేశంపై మరొక దేశానికి అపనమ్మకం కలిగించడం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పి, భారత్ చుట్టూ వున్న ప్రాంతంలో అస్థిరత సృష్టించాలని కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపింది. పాకిస్తాన్, డీప్ స్టేట్ కార్యాకలాపాలపై, భారత వ్యతిరేకులపై నిరంతరం అప్రమత్తంగా వుండి, ఆ కార్యకలాపాలను వివరించాలని ABPS మేధావులకు పిలుపునిచ్చింది. భారత్ తో పొరుగు దేశాల సంబంధాలు బలోపేతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని మేధావులను కోరింది.’’ అని అరుణ్ కుమార్ వివరించారు.