
బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోళీ సందర్భంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. శాంతిభద్రతలను అదుపులో వుండడానికి అదనపు బలగాలను కూడా మోహరించింది. ఈ నెల 14 నుంచి 17 వరకూ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ నిషేధం సైంథియా, హటోరా, గ్రామ పంచాయతీ, మథపల్సా, హరిసర, దరియాపూర్, ఫులూర్ గ్రామ పంచాయతీల్లో అమలులో వుంటాయి.
కొందరు కావాలనే పుకార్లను సృష్టిస్తున్నారని, పుకార్లు వ్యాప్తి కాకుండా వుండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు బెంగాల్ హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అయితే.. వాయిస్ కాల్స్, SMS పై ఎలాంటి పరిమితి విధించలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా వార్తా పత్రికలపై కూడా ఎలాంటి నిషేధం లేదని తెలిపింది.
సైంథియా పట్టణంలో మద్యం మత్తులో వున్న ఓ గ్రూపుకి, మరో గ్రూపుకి మధ్య మొదట మాటల ఘర్షణ జరిగింది. ఆ తర్వాత అది తీవ్ర ఘర్షణకి దారి తీసింది.ఇరువురూ ఒకరిపై ఒకరు రాళ్లుకూడా రువ్వుకున్నారు. దీంతో కొందరు గాయపడ్డారు. పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. మరోవైపు ఈ ఘర్షణలతో సంబంధమున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందన్నారు.





