News

రాష్ట్ర సౌభాగ్యం కోసం అమరావతిలో శ్రీవారి కల్యాణం

257views

అమరావతి నిర్మాణం నిరాటంకంగా కొనసాగి రాష్ట్రానికి సకల శుభాలు చేకూరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాజధానిలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్ల్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15న జరగనున్న శ్రీనివాస కల్యాణం ఏర్పాట్లను ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, మంత్రి సవిత, పలువురు అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కలియుగ దైవం శ్రీనివాసుని కల్యాణంతో శ్రీకారం చుడుతున్నామన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతిని ఆధ్యాత్మిక నగరంగా నిర్మిస్తుందన్నారు. 15న జరిగే శ్రీనివాస కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతులకు ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు పంపుతున్నట్లు వెల్లడించారు. శ్రీనివాస కల్యాణానికి వచ్చే భక్తులందరికీ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, ఎం.శాంతారాం, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌ కుమార్, ఎం.ఎస్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.