
తిరుమలను కాంక్రీట్ జంగిల్ కానీయవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి భవన నిర్మాణాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని తితిదే అధికారులను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను అనుమతిస్తే.. కొంత కాలానికి అటవీప్రాంతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ధార్మిక సంస్థలమని చెప్పుకొంటూ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే ఈవో, పలు మఠాలకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తిరుమలలో ఇష్టానుసారంగా ధార్మిక సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నా తితిదే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తిరుపతికి చెందిన టి.మహేష్ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. తితిదే తరఫు న్యాయవాది సుమంత్ వాదనలు వినిపిస్తూ.. ఓ మఠం చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.





