
ఆనందాల కేళి హోలీ (Holi).. ఈ రంగుల పండుగ వస్తుందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలుతుంటారు. బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేసేందుకు ఇలాంటి కలర్‌ఫుల్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ‘హోలికా పూర్ణిమ’ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగ వచ్చింది.
హోలీ ఎప్పటినుంచి ప్రారంభమైందంటే..
హిందూ పురాణాల ప్రకారం, రాధా, క్రిష్ణులతో హోలీ పండుగ ప్రారంభమైంది. చిన్నతనంలో కన్నయ్య రాధ ముఖానికి రంగు పూసి ఆటపట్టించేవాడు. యశోద కూడా కన్నయ్య సరదాల్ని చూసి నవ్వుతూ మురిసిపోయేదట. అలా అప్పటినుంచి ప్రతి సంవత్సరం హోలీ జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. హోలీ వేళ కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.
హోలికా దహనం..
మరో కథనం ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది.

శీతా కాలానికి వీడ్కోలు పలికి..
హోలి పండుగ వేళ సహజమైన రంగులను జల్లుకోవడం వల్ల అందరూ సంతోషకరమైన అనుభూతిని పొందుతారు. అంతేకాదు హోలికా దహనం మరుసటి రోజు నుంచే శీతాకాలానికి వీడ్కోలు పలికి.. వేసవికాలంలోకి అడుగుపెడతాం. ఈ సమయంలో రంగులను ఉపయోగించడం వల్ల మన చర్మంపై బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది. బద్ధకస్తులు చురుగ్గా మారతారు. శాస్త్రీయ పరంగా హోలీ పండుగ సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మనమంతా త్వరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం చాలా త్వరగా నీరసపడిపోతుంటాం. ఇలాంటి సమయంలో హోలీ రంగులను జల్లుకోవడానికి వీధుల్లోకి రావడం వల్ల నీరసాన్ని అధిగమించొచ్చు. బద్ధకస్తులు కాస్త చురుగ్గా మారతారు.
సహజ రంగులతో..
హోలీ పండుగ సమయంలో సహజ రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో హోలీ పండుగలో రంగులను చల్లుకునేందుకు సహజ రంగులను వాడేవారు. ముందుగా ఎండిన పువ్వులను, ఇతర ఆకులతో కలిపి రంగులను తయారు చేసేవారు. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ ఉత్తర భారతంలో కొనసాగిస్తున్నారు. ఈ సహజ రంగులను మన శరీరంపై జల్లుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.’
సహజరంగుల తయారీ విధానం..
పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వివిధ రకాల పిండిని నీటిలో కలిపి ఉపయోగించుకోవచ్చు.
మోదుగు పూలను ఉడకబెట్టి సహజసిద్దమైన రంగు తయారు చేసుకుని వాడవచ్చు.
గంధం, ఎర్ర మందార, గోగుపూలు, దానిమ్మతొక్క, టమాట, క్యారెట్, పసుపు, సున్నం, మిశ్రమం కలిస్తే ఎరుపురంగు వస్తుంది.
శనగపిండి, పసుపు మిశ్రమం, బంతి, చామంతిపూల మిశ్రమంతో పసుపురంగు వస్తుంది.
గోరింటాకు, గుల్‌మొహర్‌ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పుదీనాతో ఆకుపచ్చ రంగు తయారుచేసుకోవచ్చు.
ఇండిగో ప్లాంట్ (సిరాచెట్టు) కాయలతో నీలి రంగు తయారుచేసుకోవచ్చు.
బీట్‌రూట్, ఉల్లిపాయ తొక్కల మిశ్రమంతో ముదురుకెంపు రంగు వస్తుంది. పారిజాత పూల కాండాలను ఎండబెట్టి నానబెడితే సిందూరం రంగు వస్తుంది.
బ్రౌన్ కలర్ కోసం కాఫీ లేడా టీ పొడి కలిపి వడపోసిన నీళ్లు లేదా మరగబెట్టిన నీల్లు ఉపయోగించ్చుకోవచ్చు.
నల్ల ద్రాక్ష రసం లేదా ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని ఉడికించి రాత్రంతా అలా వదిలేసి మరునాడు నీటిలో కలిపితే నలుపురంగు తయారవుతుంది. ఎర్ర చందనాన్ని నీటిలో కలిపి ఎరుపు రంగుపు
పొందవచ్చును. గోరింటాకును రుబ్బి పిండిలో కలిపితే ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
రెండు చెంచాల గంధపు పొడిని లీటర్ నీటిలో కలిపి మరగబెడితే ఎరుపురంగు ద్రావణం తయారు చేసుకోవచ్చు.
నీటి మందును నీటిలో కలిపితే నీలి రంగు వస్తుంది.
తులసి, వేప, కలబంధ కలిపిన నూని రీటిలో కలిపితే ముందు ఆకుపచ్చ వర్ణం వస్తుంది.
సహజరంగులతో ఉపయోగాలు..
పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంధ, వేపాకుల చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధంపొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతో పాటు సువాసన వెదజల్లుతుంది.





