News

ప్రయాగ్‌రాజ్‌లో సందడికి తెర

378views

మహా కుంభమేళా ముగియడంతో ఏకబిగిన 45 రోజులపాటు కోట్లమంది తాకిడితో కోలాహలంగా కనిపించిన ప్రయాగ్‌రాజ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడంతా తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన శిబిరాలు, దుకాణాలు, ఆహారశాలలు, నమూనా ఆలయాలు, ఆరోగ్య శిబిరాలు, గుడారాల నగరాన్ని తొలగిస్తుండటాన్ని చూసి స్థానికులు ఒకింత భావోద్వేగానికి లోనవుతున్నారు. నమూనా ఆలయాల్లో తిరుమల వేంకటేశ్వరుని ఆలయం కూడా ఉంది. భక్తులకు కంటి పరీక్షల నిర్వహణ కోసం కుంభమేళా ప్రారంభానికి వారం ముందునుంచి ఏర్పాటుచేసిన నేత్ర కుంభ్‌ శిబిరాన్ని మరోరోజు పొడిగించి గురువారం ముగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు క్షేత్రస్థాయికి వచ్చి వివిధ విభాగాల సిబ్బందిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. 75వేల మంది పోలీసులకు రూ.10వేల చొప్పున బోనస్, ఏడురోజుల సెలవుల్ని ఇవ్వనున్నట్లు ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. గంగా మంటపం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఎంతో ఓర్పుతో పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో ఆయన సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పరిసరాల శుభ్రత పనుల్లో పాల్గొన్నారు.