
ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరుపొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా రూపొందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల పెద్దఎత్తున మహాకుంభమేళా నిర్వహించి నిర్వహణా నైపుణ్యాన్ని చాటుకుందని, రోజుకో రికార్డును భారతదేశం సృష్టిస్తోందని చెప్పారు. భారతదేశ నిర్వహణా నైపుణ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని అన్నారు. దేశ రాజధానిలో శనివారంనాడు నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాంక్లేవ్ 2025 లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ, భారత్‌కు రావాలని తహతహలాడుతున్నాయని చెప్పారు.
ఫిబ్రవరి 26వ తేదీతో ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మహాకుంభ్-2025 గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఒక టెంపరరీ సిటీలో నదీతీరాల వెంబడి కోట్లాది మంది ప్రజలు పవిత్రస్నానాలు చేయడంపై యావత్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిందని, మహాకుంభమేళా నిర్వహణ భారతదేశం పాటించే నిర్వహణా నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.




