News

తన చరిత్రను కాలగర్భంలో కలిపేసి… సిలబస్ ను మార్చుకున్న బంగ్లాదేశ్

500views

బంగ్లాదేశ్ ప్రభుత్వం తన చరిత్రను తాను కాల గర్భంలో కలిపే పనిలో నిమగ్నమైంది. బంగ్లా ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా పిలుచుకునే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కి సంబంధించిన చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించనుంది. అలాగే ముజిబుర్ రెహ్మాన్ తో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంశీ చిత్రాలను కూడా తొలగించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో భారత్ పాత్రను కూడా తగ్గించింది. ఈ మేరకు నేషనల్ కరికులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ బోర్డు మార్పులు చేయడం గమనార్హం.ఇలా 441 పాఠ్య పుస్తకాల్లో పై విధంగా సవరణలు చేసింది.

1972 లో కలకత్తా ర్యాలీలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ పాల్గొన్నారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరా గాంధీ ఢాకాలో పర్యటించారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకూ పాఠ్య పుస్తకాల్లో వున్నాయి. కానీ… తాజాగా సవరించిన సిలబస్ ప్రకారం ఈ ఫోటోలు అందులోంచి తీసేశారు. అలాగే 5 వ తరగతి పుస్తకం నుంచి పాక్ దళాలు భారత సైన్యం ముందు లొంగిపోతున్న ఫోటోని కూడా తొలగించారు. షేక్ హసీనా పాలన సమయంలో, పుస్తకాల్లో హిందుత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని, బెంగాల్ ముస్లిం పాలకుల సహకారాన్ని దెబ్బతీస్తున్నారని, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా ముస్లింల మత విశ్వాసాలను అవమానిస్తున్నారని ప్రభుత్వంపై మత ఛాందసులు ఒత్తిడి తెచ్చారు.

బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడానికి భారత్ పాత్ర చాలా వుందని పుస్తకాల్లో రాశారు. తాజాగా ఈ లైన్ ని తొలగించారు. భూటాన్ సాయం చేసిందని రాసుకొచ్చారు. అలాగే వెనుక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశం వుండేది. కొత్త పుస్తకాల్లో తొలగించేశారు.

అయితే.. దీనిపై అక్కడి ప్రభుత్వ అధికారులు వింతైన వివరణ ఇచ్చుకున్నారు. 2012 కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా సవరణ చేశామని, అంతే తప్ప ఇతర కారణాలు లేవని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తాయమని విద్యాశాఖ ప్రకటించింది.