
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని సిద్ధనకొండూరు గ్రామం వెయ్యేళ్ల క్రితమే వర్థిల్లినట్లు ప్రముఖ చరిత్రకారుడు రసూల్బాబు తెలిపారు. సిద్ధనకొండూరులోని సిద్ధేశ్వరుడి కొండపై ఉన్న శిలాశాసనాన్ని భారతీయ పురావస్తు శాఖ చైన్నె శాసన విభాగ అధిపతి పరిశీలించారు. సిద్ధేశ్వరాలయం పరిసర ప్రాంతాలను సందర్శించారు. సుమారు 800 ఏళ్లనాటి మనుమగొండ గోపాలుని వెల్లడించిన 5 అడుగుల శిలాశాసనం స్తంభాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఈ శిలాశాసనం 13వ శతాబ్దానికి చెందిన మనుమసిద్ధి కుమారుడు మనుమగండ గోపాలుని కాలానికి చెందిందన్నారు. క్రీస్తు శకం 1290 ప్రాంతంలో సిద్ధనకొండూరు ప్రాంతాన్ని పాలించిన నూంకి నాయకుడి కుమారుడు సిద్ధప్పనాయుడు శాసనంను జారీ చేశారన్నారు. ఈ శాసనంలో సిద్ధేశ్వరుడికి చెరువు మానాన్ని దానంగా ఇచ్చినట్లు రాసి ఉందన్నారు. తెలుగు, కన్నడ లిపి నుంచి పూర్తి తెలుగు లిపిగా మార్పు చెందే దశను ఈ శాసనంలో చూడొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయుడు నందనవనం ప్రభాకర్‌రావు, ఆలయ ధర్మకర్త రూపిశెట్టి రామభద్రరావు, పాలిశెట్టి లక్ష్మీకాంతరావు, శివశంకర్, శ్రీకాంత్, మాధవరావు, మల్లిక్, తదితరులు పాల్గొన్నారు.





