
( ఫిబ్రవరి 14 – దామోదరం సంజీవయ్య జయంతి )
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన మూడవ రోజున తండ్రి మరణించాడు. కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేతపనిలో రోజూ కూలి చేస్తూ జీవించేవారు. కొద్దికాలం సుంకులమ్మ అన్నగారి ఊరు పాలకుర్తిలో ఉన్నారు. అక్కడ సంజీవయ్య సోదరులతో కలసి పశువులను కాస్తూ ఉండేవారు.
పెదపాడులో చిన్నన్నయ్య సంజీవయ్యను స్కూలుకి పంపి ఆయన పనికి వెళ్లేవాడు. ఆపై సంజీవయ్య కర్నూలులోనే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్‌లో, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చదివి 1938లో ఎస్.ఎస్.ఎల్.సి జిల్లా ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత అనంతపురం జిల్లా ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల నుండి 1942లో బి.ఎ.పూర్తి చేసి, కర్నూలులోనే రూ.48.30 పైసల జీతానికి ఉద్యోగంలో చేరాడు. బళ్లారి కేంద్ర ప్రజా పనుల శాఖలో తనిఖీ అధికారిగా, ఆపై మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. బళ్లారి జిల్లా జడ్జి కె.ఆర్. కృష్ణయ్యశెట్టి ప్రోత్సాహంతో మద్రాసు లా కాలేజీలో చేరి రూ. 90 జీతానికి జార్జిటౌన్ లోని పోగ్రసివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేశారు. 1950లో మద్రాస్ బార్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. లా అప్రెంటీస్ చేస్తున్నప్పుడు సంజీవయ్యకు కలిగిన నాయకుల పరిచయం, సాంగత్యం వలన రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి కలిగింది. అందుకోసం మంచి వక్తగా రాణించాలని భాషలపై శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.
పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యుడిగా సంజీవయ్యకు సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. లా చదివే రోజుల్లో ‘చంద్రగుప్త’ నాటకంలో నాయక పాత్ర పోషించి మంచి నటునిగా గుర్తింపు పొందారు. ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని గద్యంలో రాశారు. ‘శివాజీ’ అనే నాటకాన్ని తానే రచించి ప్రదర్శించారు. ‘ది లేబర్ ప్రోబ్లమ్స్ అండ్ డెవలప్ మెంట్’ అనే గ్రంధాన్ని రాసారు. ఇవన్నీ లభ్యం కావడం లేదు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పిడతల రంగారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డి, పి. వి. నరసింహారావు, పరకాల శేషావతారం, ఎ.వి. సుబ్బారెడ్డి వంటి నాయకులు పాలకులుగా మంత్రులుగా రాణిస్తున్న రోజులవి.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికైనప్పుడు ఆ మంత్రి వర్గంలో దామోదరం సంజీవయ్య ఆరోగ్య శాఖా మంత్రి. అప్పుడే పాఠశాల ఉపాధ్యాయిని కృష్ణవేణిని మే 7, 1954న పెళ్లి చేసుకున్నారు. వీరు సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బస్సు రూట్ల జాతీయకరణ వివాదంతో, సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తాత్కాలి కంగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సంజీవయ్య జనవరి 11, 1960న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రానికి అలా మొదటి దళిత ముఖ్యమంత్రి వచ్చారు. అప్పటికి సంజీవయ్య వయసు 39 ఏళ్లు. ఆ పదవిలో మార్చి 29, 1962 వరకూ కొనసాగారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీని చాటుకున్నారు.
‘కట్టెల పొయ్యి తీసేసి కిరోసిన్ పొయ్యి ఇస్తారా?’
సంజీవయ్య అంటే గిట్టని నాయకులు కొందరు, ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రధాని నెహ్రుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఓ వ్యక్తిని సంజీవయ్య సొంతూరు పెద్దపాడుకు నెహ్రూ పంపారు. అక్కడ ఓ చిన్న ఇంటి ముందు కారు ఆపి.. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ఓ వృద్దురాలిని ఆ వ్యక్తి పలకరించారు. ఇంటి ముందు కారు ఆగడం. … పెద్దమనిషి తనను కలవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘నా కుమారుడికి ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తున్నారా? మా అబ్బాయి జీతం పెరుగుతుందా? ఈ కట్టెల పొయ్యి తీసేసి కిరోసిన్ పొయ్యి కొనుక్కోవచ్చా..?’ అంటూ ఆశగా అడిగారు. ఆమె ఎవరో కాదు.. అప్పటి రాష్ట్ర మంత్రి సంజీవయ్య తల్లి సుంకులమ్మ.
సంజీవయ్య నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాలలో పని చేశారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ‘బోనస్’ చట్టాన్ని ప్రవేశపెట్టి ‘బోనస్ సంజీవయ్య’గా మన్ననలను పొందారు. జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఇ.ఎస్.ఐ చట్టంలో కుటుంబం అనే పదాన్ని చేర్చడమే గాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. నిజాం సుగర్స్‌లో వచ్చే మొలాసిస్ నుండి లిక్కర్ కాకుండా దాన్ని పేపరు తయారీకి వాడాలని ఆదేశించారు.
హైద్రాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తరువాత నిజాం భూములలో 6 లక్షల ఎకరాల మిగులు భూమి గుర్తించి ఎస్.సి, ఎస్.టి, బి.సి లోని అన్ని వర్గాలకు పంచి కులాల మధ్య సయోధ్యను తీసుకవచ్చారు. హిందీ ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి జిల్లాకు ఓ హిందీ కళాశాల ఉండాలని ప్రతి పాదించారు.
అవినీతి నిరోధక శాఖ (ACB), లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIDCAP), హైదరాబాద్-సికింద్రాబాద్‌లను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యనే. మాతృభాషపై మమకారంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్త్యుత్తరాలు తెలుగులోనే జరగాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో వంశధార, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు, కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది సంజీవయ్యనే.
ముఖ్యమంత్రి పదవి సంజీవయ్యకు ముళ్లబాటే అయింది.1962లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో సంజీవయ్యను అధిష్టానం పోటీకి నిలపలేదు. సీఎంగా రాజీనామా చేసినా ఆయనలో కించిత్ బాధ కన్పించలేదని సన్నిహితులు చెపుతారు.
విలక్షణ నాయకుడు సంజీవయ్య. ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేత. ఇంకా చెప్పాలంటే పేద కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన నాయకుడు. కుటిలనీతితో రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆ కొద్ది కాలంలోనే అయన సాధించిన విజయాలు చిరస్మరణీయం.1967లో ఎన్నికల ప్రచారం కోసం విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంజీవయ్య తిరిగి కోలుకోలేదు. 1972 మే 7వ తేదీన గుండెపోటుతో ఆయన మరణించారు. సికింద్రాబాద్ పాటిగడ్డలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం జరిగింది. అయన స్మారకార్థం పాటిగడ్డ సమీపాన ఒక ఉద్యానవనం అభివృద్ధి చేశారు. దామోదరం సంజీవయ్య నేషనల్ లా కాలేజీ పేరుతో విశాఖలోను ఆయనను గుర్తుంచుకుంటారు.





