News

ఆత్మనిర్భరత, సమానత్వం దిశగా ఆర్మీ ఏవియేషన్

391views

కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా మన దేశంలో కొత్త పరికరాల తయారీయే కాకుండా ప్రపంచం కోసం తయారుచేయాలనే పిలుపును అందిపుచ్చుకున్న రక్షణరంగం- అత్యాధునిక సామర్థ్యాలతో భావి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కర్ణాటకలో యలహంకలోని వైమానిక కేంద్రంలో జరుగుతోన్న 15వ ఏరో ఇండియా ప్రదర్శన (Aero India Show) వీటన్నింటికీ వేదికగా నిలిచింది.

విజన్ 2047..
2047 వైపు పురోగమిస్తోన్న భారత్‌.. వైమానిక రంగంలో స్వావలంబన, సాంకేతికంగా అధునాతన శక్తిగా ఆవిర్భవించేందుకు కట్టుబడి ఉంది. ఇంటిలిజెన్స్, నిఘా, లాజిస్టిక్స్‌లో మన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంతో మిలిటరీ ఆపరేషన్‌లలో కీలకపాత్ర పోషించడానికి వీలు కలగనుంది. అలాగే తర్వాత తరం యుద్ధ హెలికాప్టర్లు, ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేయడం వల్ల మన సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.

ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్స్‌ నారీశక్తికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పలు కీలక పోస్టుల్లోకి మహిళా అధికారులను తీసుకుంటోంది. దీంతో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మిలిటరీ ఆపరేషన్లలో నారీమణులు కీలకంగా వ్యవహరించేందుకు దోహదం చేయనుంది. ఆ దిశగా 2022లో మిలిటరీ పైలట్లుగా చేరిన వారిలో మేజర్ అభిలాషా బారక్.. ప్రతిష్ఠాత్మక సిల్వర్ చీతా ట్రోఫీని దక్కించుకున్నారు. కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణలో భాగంగా అద్భుతమైన ప్రతిభ చూపినవారికి దీనిని అందిస్తారు.

ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో 13 మంది మహిళలు ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రిమోట్లీ పైలటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ఆపరేషన్లలో 8 మంది, వివిధ ఆర్మీ ఏవియేషన్ స్వ్కాడ్రన్‌లలో 9 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే యుద్ధరంగంలోనూ వారిని మోహరిస్తున్నారు. వారి సామర్థ్యాన్ని గుర్తించిన భారత సైన్యం.. మహిళా అధికారులకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది.