News

సంస్కృత భాష ప్రచారం, సంభాషణ కోసం 13 గ్రామాలను ఎంపిక చేసిన సర్కార్

223views

సంస్కృత భాషా పరిరక్షణ, ప్రచారం కోసం ఉత్తరాఖండ్ సర్కార్ 13 గ్రామాలను మోడల్ సంస్కృత గ్రామాలుగా ప్రకటించింది. ఈ 13 గ్రామాల్లో కార్యకలాపాలు, సంభాషణలన్నీ కూడా సంస్కృత భాషలోనే సాగుతాయి. ఇందుకోసం ప్రభుత్వం సంస్కృత అధ్యాపకులను కూడా నియమిస్తుంది. రాష్ట్రంలో సంస్కృత భాష వైభవాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతోనే ఈ గ్రామాల ప్రకటన, ఉపాధ్యాయుల నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

నూర్ పూర్ పంజన్ హెడి, భోగపూర్, కోట్ గావ్, డిమ్మర్, గోదా, బైజీ, ముఖేం, పాండే, జాంతి, ఖార్కర్కి, ఉర్గ్, షెరీ, నాగ్లా తెరాయి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక్కడికే సంస్కృత అధ్యాపకులు వెళ్లనున్నారు. ఈ గ్రామ ప్రజలు సంస్కృత భాషను అధ్యయనం చేసేలా, సంస్కృత భాష సంభాషణం జరిగేలా ఈ అధ్యాపకులు చూస్తారు. ఈ అధ్యాపకులను కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీకి చెందిన సంస్కృత అధ్యాపకులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఇక… ఈ గ్రామాల్లో సామాజిక సమరసత పెంపొందేలా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించిన పిల్లలకు కూడా సంస్కృతాన్ని బోధిస్తారు.

సంస్కృత విద్యాశాఖ మంత్రి ధనసింగ్ రావత్ మాట్లాడుతూ… సంస్కృతం రెండో అధికార భాషగా రాష్ట్రంలో నడుస్తోందని తెలిపారు. దాని పరిరక్షణ కోసం, సంస్కృత భాషా ప్రచారం కోసం రాష్ట్రంలో 13 జిల్లాలను మోడల్ జిల్లాలకు ప్రకటించామన్నారు. మహిళలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామని తెలిపారు. సంస్కృత భాష, బోధనతో పాటు సంప్రదాయ సంస్కృతులు, పురాణాలు, ఉపనిషత్తులకి సంబంధించిన శ్లోకాలను కూడా అభ్యాసం చేయించనున్నారు.