
గంగాదేవి, శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు. వశిష్టుని శాపంవల్ల భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, సత్యవ్రతుడిగా జీవించాడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి దాశరాజు విధించిన నియమాలను అంగీకరించాడు. తాను రాజ్యం వదులుకుని తండ్రికి జన్మించబోయే సంతానానికి రాజ్యం లభించేట్టు, తనకు బిడ్డలు కలిగితే సింహాసనానికి పోటీపడతారని ఆమరణ బ్రహ్మచర్యం పాటించేలా ప్రతిజ్ఞలు చేసి, భీష్ముడిగా ఖ్యాతి గాంచాడు. శంతన సత్యవతుల ప్రథమ పుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణించగా, తర్వాతివాడైన విచిత్రవీర్యుడికి హస్తినాపుర పట్టంగట్టాడు. కాశీరాజు తనయలైన అంబిక, అంబాలికలను కట్టబెట్టాడు. ప్రథమ పుత్రిక అంబ సాల్వుడిని వరించినందున ఆమెని సాల్వదేశానికి పంపాడు. విచిత్రవీర్యుడు భోగలాలసుడై, నిర్వీర్యుడై ప్రాణాలు కోల్పోయాడు. సత్యవతి కోరినా తన ప్రతిజ్ఞలకు కట్టుబడిన భీష్ముడు సింహాసనం చేపట్టలేదు, వివాహం చేసుకోలేదు. రాజులు మృతులైనప్పుడు అప్పటి దేవరన్యాయాన్ని అనుసరించి సత్యవతి వేదవ్యాసుని స్మరించింది. ఆయన అనుగ్రహం వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు కలిగారు. సంతానం సలక్షణంగా లేనందున మరో పుత్రుని కనమంది సత్యవతి. కానీ అంబిక తన స్థానంలో దాసిని ఉంచగా విదురుడు జన్మించాడు. వారందరినీ సాకి, విద్యాబుద్ధులు చెప్పించాడు భీష్ముడు. వారి రాజ్యకలహంలో తన ప్రతిజ్ఞకు కట్టుబడి, అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలబడ్డాడు. శిఖండిని ఎదురుగా నిలబెట్టి చేసిన యుద్ధంలో పడిపోయి, అంపశయ్య పాలయ్యాడు. ఇంటింటా పారాయణం చేసే విష్ణుసహస్ర నామం మొదటిసారి పారాయణం చేసిందీ, అంపశయ్య మీదే ధర్మజునికి రాజనీతి అంశాలు బోధించిందీ భీష్ముడే. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమినాడు భీష్మాచార్యుని ఆత్మ పరమాత్మలో లీనమైన రోజు ‘భీష్మాష్టమి’గా ప్రసిద్ధమైంది. మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’, ‘మహాఫల ఏకాదశి’, ‘జయఏకాదశి’ అంటారు.





