ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్య రామమందిర ట్రస్ట్ రాములవారి దర్శన వేళలను గంటన్నర పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం 4 గంటలకు ‘మంగళ ఆరతి’ జరుగుతుంది. ఆ తర్వాత ఆలయ తలుపులు కొద్దిసేపు మూసివేయబడతాయి. ఉదయం 6 గంటలకు ‘శృంగర్ ఆరతి’ జరుగుతుంది. ఇది ఆలయం ప్రజల కోసం తెరవబడటానికి గుర్తుగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ‘‘రాజ్‌భోగ్’ నైవేద్యం సమర్పించబడుతుందని.. ఆ సమయంలో భక్తులకు దర్శనం అనుమతిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది. సాయంత్రం 7 గంటలకు ‘సంధ్యా ఆరతి’ నిర్వహించనున్నారు. ఆ సమయంలో ఆలయ తలుపులు 15 నిమిషాలు మూసివేయబడి తిరిగి తెరవబడతాయి. ‘శాయన ఆరతి’ రాత్రి 9.30 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత రాత్రికి ఆలయం మూసివేయబడుతుంది.





