News

ప్రాచీన గిరిజన విజ్ఞానం అమూల్యమైనది

361views

ప్రాచీన గిరిజన విజ్ఞానం చాలా గొప్పది, అమూల్యమైనదని విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య టీవీ కట్టిమని అన్నారు. గిరిజనులకు తెలిసిన విజ్ఞానం ప్రకృతి ప్రసాదించిన వరమని… దాని ద్వారా గ్రహాల గతులు, రుతువులు, పంటలకు సంబంధించిన పరిజ్ఞానం, వివిధ వ్యాధులను గుర్తించడం, దానికి పసరుల ద్వారా వైద్యం చేయడం వంటి అంశాలపై ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. పురాతన వైద్యానికి నేటి టెక్నాలజీ జత అయితే వాటిని సంరక్షించడమే కాకుండా నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.విజయనగరం సీటీయూలో జరిగిన “నేషనల్ సెమినార్ ఆన్ రీసైలియన్స్ అండ్ రి-కనస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్” అనే రెండురోజుల జాతీయ సెమినార్ లో భాగంగా ఆయన మాట్లాడారు. భారతీయ విజ్ఞానం పై చాలా పరిశోధనలు చేసి ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడే ఆవిష్కరణలు కావాలన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన.. కేరళకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ గిరిజన వైద్యురాలు లక్ష్మీ కుట్టి మాట్లాడుతూ, అడవిలో దొరికే చెట్ల వేళ్లు బెరడు, కొమ్మలు, ఆకులు, కాండం, పువ్వులు, కాయలు, కొన్ని విధాలైన మట్టి, ప్రత్యేకమైన రాళ్ళు, నీరు తదితరమైన వన్నీ వైద్యానికి పనికి వస్తాయని చెప్పారు. రోగాన్ని, అవసరాన్ని, వ్యక్తి శరీర ధర్మాన్ని బట్టి వైద్యం ఇస్తారని చెప్పారు. అడవి లోకి వెళ్తున్నప్పుడు మౌనంగా ఉంటే అక్కడి చెట్లు, మొక్కలు, గాలి, నీరు, ప్రకృతి మనతో మాట్లాడతాయని.. ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు వనదేవత మనకు సహకరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు.