
సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కృష్ణా జిల్లా ప్రచారక్ శ్రీనాథ్ తెలిపారు. రథసప్తమి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ క్షేత్ర హనుమంతపురం, చిక్కవరం గ్రామంలో విద్యార్థులకు సూర్య నమస్కార పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనాథ్ రథసప్తమి వేడుకలను నేడు సూర్య నమస్కారాలతో ప్రారంభిస్తారన్నారు. సూర్య నమస్కారాన్ని నిరంతర అభ్యాసంతో మెరుగైన మానసిక స్పష్టత, ఏకాగ్రతకు దారితీస్తుందన్నారు. శారీరక, మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు యోగా అనేది విశిష్టమైన వ్యాయామన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, మంత్రం, ధ్యానం ఇలా అన్నింటిని మిళితం చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారమని చెప్పారు. యోగా గురువులు సూర్యోదయం సమయాన సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్ధులు పాల్గొని సూర్య నమస్కారాలు, వివిధ రకాల ఆసనాలు చేశారు.





