News

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

246views

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల మీద అల్ ఫాజిద్ అనే వ్యక్తిని కేరళకు చెందిన ఎన్ఐఏ అధికారులు తమిళనాడులోని మైలాదుత్తురై జిల్లా తిరుముల్లైవసల్ గ్రామంలో అరెస్ట్ చేసారు. ఎన్ఐఏ అంతకుముందు జనవరి 28నాడే గ్రేటర్ చెన్నై పరిధిలో ఐసిస్ మాడ్యూల్‌ను ఛేదించింది.

అల్ ఫాజిద్ ఎనిమిది నెలలుగా ఒక ప్రైవేటు ఆంబులెన్స్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు, ఐసిస్ కోసం ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తున్నందుకు అతన్ని అరెస్ట్ చేసారు. అల్ ఫాజిద్ వాట్సప్ ద్వారా కాలేజీ విద్యార్ధులను, యువతను ఆకట్టుకొంటున్నాడు. వారికి బ్రెయిన్‌వాష్ చేసి అతివాదులుగా మార్చి ఐసిస్‌ కోసం రిక్రూట్ చేస్తున్నాడు.

ఈ అల్ ఫాజిదే తమిళనాడు ఐసిస్ విభాగం అధిపతి అని భావిస్తున్నారు. అతను సుమారు 8 నెలలుగా చెన్నైలోని పురసవాక్కం ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు అదే పురసవాక్కంలోని తమ కార్యాలయంలో ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు నిర్దిష్టమైన నిఘా సమాచారం ఆధారంగా ఎన్ఐఏ చెన్నైలో 5 చోట్లా, మైలాదుత్తురై జిల్లాలో 15 చోట్లా సోదాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర డిజిటల్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫాజిద్‌కు ఐసిస్ హ్యాండ్లర్లతో, ప్రత్యేకించి సాదిక్ అనే వ్యక్తితో, సంబంధాలున్నాయని సమాచారం.

కొంతకాలంగా తమిళనాడులో ఐసిస్ కార్యకలాపాలను అడ్డుకోవడం కోసం ఎన్ఐఏ క్రియాశీలంగా పనిచేస్తోంది. కొన్నాళ్ళ క్రితం మతమార్పిడుల విషయంలో జరిగిన గొడవలో తిరుబువనం రామలింగం అనే వ్యక్తి హత్య జరిగింది. ఆ కేసులో మూడురోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుత్ తహ్రీర్‌తో సంబంధాలు ఉన్న సుమారు 15మందిని అరెస్ట్ చేసారు. 2022లో దీపావళి ముందురోజు కోయంబత్తూరులో కొట్టై సంగమేశ్వర దేవాలయం దగ్గర కారులో ఐఈడీ పేలుడు కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

విచిత్రం ఏంటంటే, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తమిళనాడులో ఇన్ని సోదాలు చేస్తోంది, ఇంతమందిని అరెస్ట్ చేస్తోంది కానీ రాష్ట్రప్రభుత్వానికి చెందిన నిఘా విభాగం మౌనంగా ఉంది. డీఎంకే పాలనలోని తమిళనాడులో నిఘా విభాగానికి తమ రాష్ట్రంలో ఉగ్రవాద మాడ్యూల్స్‌ గురించి, వారి కార్యకలాపాల గురించీ ఏమాత్రం సమాచారం లేకపోవడం గమనార్హం.