ArticlesNewsProgramms

ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పది : వెంకయ్య నాయుడు

240views

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన – ఆదివాసి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ,”భారతదేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజసిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను ప్రచారం చేయడం, వారి ఆదాయ వనరులను మెరుగు పరచడం ఎంతో ముఖ్యం. ఆదివాసీ – గిరిజన ఉత్పత్తులను, నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమౌతుంది. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్త కళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలి. ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రకృతి హితమైన వారి ఉత్పత్తులు సమాజానికి చేరువ కావలసిన అవసరం ఉంది. సేంద్రీయ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించటం ద్వారా మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉంది.ముఖ్యంగా ఆదివాసీ – గిరిజన యువకులు సాంకేతికతను అందిపుచ్చుకుని, ఈ ఉత్పత్తులను ప్రపంచంతో అనుసంధానించడం ద్వారా మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఈ దిశగా ఆదివాసీ – గిరిజనులందరూ ఏకతాటి మీదకు రావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్టీ వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలి. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే, మీ కోసం వంద అడుగులు ముందుకు వేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని ఆదివాసీ – గిరిజన సోదరులు గ్రహించాలి.” అని చెప్పారు.


ఆదివాసీలంటే తనకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. తాము జీవించటంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనది అన్నారు.” మాతృ, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ… వైవిధ్యమైన తరహాలో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శనీయమైనది. మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి పట్ల వారికి ఉండే అవ్యాజమైన ఆప్యాయతానురాగాలు ఎంతో ప్రత్యేకమైనవి. స్వరాజ్య సంగ్రామంలో వారు ఎంతో విలువైన పాత్ర పోషించారు.భారతదేశ జనాభాలో ఆదీవాసీల సంఖ్య 8శాతం.. అంటే దాదాపుగా 10కోట్ల మంది ఆదీవాసీలు ఉన్నారు. సమగ్రాభివృద్ధి (సబ్‌కా వికాస్) అనే జాతీయ లక్ష్యంలో ఆదీవాసీల అభివృద్ధి అనేది కూడా ఓ కీలకాంశం. ” అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు.

“గిరిజన అభివృద్ధికి సంబంధించిన ఎన్నో సవాళ్లు, సమస్యలున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తోంది. ఒక జాతి అస్తిత్వం.. వారి సంస్కృతి పైనే ఆధారపడి ఉంటుంది. మిగిలిన అన్నిచోట్లా అనుసరించే అభివృద్ధి నమూనాలను.. ఆదీవాసీలకు కూడా అమలుచేసి వారి ప్రత్యేకమైన గుర్తింపును ధ్వంసం చేసే పద్ధతులను అనుమతించలేం. అలా జరిగితే ఆదీవాసీలతోపాటు సమస్త మానవాళికి అది తీరని నష్టం చేసినట్లవుతుంది. సామాజికంగా వారి అభివృద్ధిని సాధించటంతో పాటు, వారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడినప్పుడే మానవాళికి మేలు చేసిన వారమౌతాం. అభివృద్ధి విషయంలో ఆదీవాసీలకు చాలా విషయాలను నేర్పించాల్సి ఉంటుందని పట్టణాల్లో ఉండే వాళ్లు అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆదీవాసీల నుంచే పట్టణాల్లో ఉండే వారు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయాన్ని మనం మరిచిపోతున్నాం. ఆదివాసీలంటే మూలవాసులని అర్థం. వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం, నైతిక విలువలు, నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది. నాటినుంచి ఇప్పటికీ సనాతన పద్ధతులను పాటిస్తూ నిరాడంబరంగా జీవించడమే ఆదివాసీల గొప్పదనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ” అని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.