News

క్షమించండి…. భారత్ ని కోరిన ”మెటా”

234views

భార‌తీయ ఎన్నిక‌ల‌పై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ త‌ర‌పున మెటా సంస్థ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కరోనా స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వాలు కూలిన‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల కామెంట్ చేశారు. అయితే ఆ దేశాల్లో భార‌త్ కూడా ఉన్న‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది.

మెటా ఇండియా ప‌బ్లిక్ పాల‌సీ వైస్ ప్రెసిడెంట్ శివ‌నాథ్ తూక్ర‌ల్ త‌న ఎక్స్ అకౌంట్‌లో జుక‌ర్‌బ‌ర్గ్ త‌ర‌పున క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ఆ సారీ స్టేట్మెంట్‌ను ట్యాగ్ చేశారాయ‌న‌. కరోనా త‌ర్వాత అనేక దేశాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార పార్టీలు ఓట‌మి చ‌విచూశాయ‌న్న విష‌యం అనేక దేశాల్లో నిజ‌మైంద‌ని, కానీ భారత్ విష‌యంలో అది నిజం కాలేద‌ని ఒప్పుకున్నారు. ఆ త‌ప్పు ప‌ట్ల తాము క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు వెల్లడించారు.ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని, దీనికి తాము క్షమాపణలు చెబుతున్నామని తుక్రాల్ పేర్కొన్నారు.

మెటా సంస్థ‌కు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు మెటా సంస్థ‌కు స‌మ్మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ చైర్మ‌న్ నిశికాంత్ దూబే తెలిపారు. కరోనా త‌ర్వాత సుమారు 20 దేశాల్లో ఆయా పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. కానీ భారత్ లో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు.జో రోగన్ పాడ్ కాస్ట్ లో జుకర్ బర్గ్ మాట్లాడుతూ 2024 లో జరిగిన ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో అధికారంలో వున్న పార్టీలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. అది ద్రవ్యోల్బణం వల్ల కావొచ్చు, లేదా కోవడ్ ను ఎదుర్కోడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్ల కావచ్చని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించిందని పేర్కొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది.

జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గత యేడాది నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వంపై వారికి నమ్మకం వుందన్నారు. జుకర్ బర్గ్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, తప్పుడు సమాచారం చెప్పడం నిరాశకు గురి చేసిందని కేంద్ర మంత్రి అన్నారు.