News

పశువధ ఆపేంత వరకూ పోరాటం : గోసేవా సమితి

392views

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి పంచాయితీ పరిధిలోని సత్యవాడ రోడ్డులో చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న పశు వధకు జిల్లా కలెక్టర్‌ బాధ్యురాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రామరాజ్యం వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి తెలిపారు. తణుకులో తణుకు గోసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశువధ నిర్వహిస్తున్న కర్మాగారానికి అనుమతులు లేవనే విషయం అధికారులకు తెలుసని, తణుకు తహసీల్దారు నుంచి కలెక్టరు వరకు ఫిర్యాదులు చేసినా.. కర్మాగారంలో పాడి పశువులను అత్యంత క్రూరంగా హింసించి చంపుతున్న వైనాన్ని అధికారులే ప్రోత్సహిస్తున్నారన్నారు. అధికారులు ప్రజా సేవకులని.. వారి బాధ్యతలు నిర్వర్తించని క్రమంలో సామాన్యుడు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించే పరిస్థితి నూతన చట్టం ప్రకారం ఉందన్నారు. తమ కర్మాగారానికి ఎన్‌ఓసీ ఇప్పించమని నిర్వాహకులు గత నెలలో పంచాయితీకి దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఇవ్వలేదని అయితే అనుమతులు లేకుండానే పశువధ నడుస్తున్నట్లుగా కాదా? అని నిలదీశారు. పశు వధ ఆపేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాజేష్‌నాథ్‌ అఘోరా మాట్లాడుతూ పశు వధ నుంచి తణుకు ప్రాంతాన్ని కాపాడుకోవడానికి రానున్న రోజుల్లో తణుకు ప్రాంతానికి ఆఘోరాలు రానున్నారని, ప్రజలు కూడా కలిసిరావాలని అన్నారు. కార్యక్రమంలో గోసేవా సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్‌, సత్తిరాజు వెంకట సుబ్రహ్మణ్యం, జల్లూరి జగదీష్‌, చవ్వా శ్రీనివాసరాజు, వి.వెంకట రమ, బొద్దాని శ్రీనివాస్‌, పసుపులేటి సూరిపండు తదితరులు పాల్గొన్నారు.