
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశామని…ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించమని..11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తామన్నారు.3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.




