News

ఇస్లాంని వీడి.. తిరిగి సనాతన ధర్మంలోకి 45 కుటుంబాలు

440views

యూపీలోని 45 కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. యూపీలోని హాపూర్ ప్రాంతంలో సంవత్సరాల క్రితం ఈ కుటుంబాలు ఇస్లాంని స్వీకరించాయి. తిరిగి ఇప్పుడు హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన పేరును సన్సార్ సింగ్ గా మార్చుకున్నారు. ఇలాగే ఇతరులు కూడా తమ పేర్లను మార్చుకున్నారు. అయితే… ఇతని కుటుంబం ఇస్లాంని స్వీకరించినా… అంత్యక్రియలు మాత్రం హిందూ ధర్మం ప్రకారమే నిర్వహించాలని ఇతని తాత చివరి కోరిక కోరాడు. దీనిని సన్సార్ సింగ్ నెరవేర్చాడు.

ఈ సమయంలోనే వారు గంగానదిలో స్నానం చేసి, శుద్ధి పొంది, హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబం పాక్ మూలాలున్న కుటుంబమని, చాలా సంవత్సరాల క్రితం ఇస్లాంలోకి మారాల్సి వచ్చిందన్నారు. అయితే దేశ విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డామని, తాము ఇస్లాంలో వున్నా… తమ పూర్వీకులందరూ హిందూ ధర్మంలోకి రావాలని చాలా ఉత్సుకతతో వుండేవారన్నారు. కానీ కొన్ని బలవంతాల కారణంగా మతం మారాల్సి వచ్చిందని వాపోయారు.

నాలుగు సంవత్సరాల క్రితమే తిరిగి హిందూ మతం స్వీకరించాలని తమ కుటుంబం భావించిందన్నారు. కానీ.. సమాజంలో వ్యతిరేకత వస్తుందని, భయంతో తాము ఇస్లాంలోనే వుండిపోయామన్నారు. అంతిమంగా తన తాతయ్య సంకల్పాన్ని నెరవేర్చడానికి ధైర్యంగా అడుగులు వేసి, హిందూ ధర్మాన్ని స్వీకరించామని ప్రకటించారు. మతం మారిన తర్వాత వీరు గౌరీశంకర్ అన్న గోత్రాన్ని స్వీకరించారు. అలాగే ఇస్లాం పేర్లను విడిచిపెట్టి, హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లను స్వీకరించారు. సనాతన ధర్మాన్ని తిరిగి స్వీకరించినందుకు గర్వంగా వుందని ప్రకటించారు.