
పరమాత్మ నామ సంకీర్తన చేస్తే మోక్షం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్బోధించారు. కొంతమంది భక్తితో, మరి కొంతమంది హేళనతో, ఇంకొందరు ఊతంతో, మరికొందరు పరిహాసంతో ఏదో ఒక విధంగా భగవన్నామ స్మరణ చేస్తే, పాపాలన్నీ పోయి ముక్తి లభిస్తుందన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజవోలు గాయత్రీ నగర్‌లో రామాలయం వద్ద శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి మంగళశాసనాలతో రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ లోక కల్యాణార్థం అహోబిల రామానుజ జీయర్ స్వామి చేస్తున్న శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా నాల్గో రోజు ప్రవచనం కొనసాగించారు. నిత్యం నారాయణ స్మరణతో నరనరాన నారాయణ శబ్దం జీర్ణించుకుంటే సద్బుద్ధి అలవడుతుందని అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. నారాయణ అంటే చాలు పాపాలన్నీ పోతాయని, అయితే నిత్యం ఇలా స్మరించడం వల్ల పాపాలకు దూరంగా ఉంటామని ఆయన అన్నారు. అజామిళుని వృత్తాంతం ఇదే చెబుతుందన్నారు. అజామిళునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై చావునకు సిద్ధంగా ఉన్న సమయంలో యమభటులు ప్రత్యక్షమవడంతో భయంతో తన కుమారుడిని నారాయణ అని పిలుస్తాడని, అలా అజామిళుని నోట నారాయణ అనే శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణుకుతూ వెళ్లిపోయారని వివరించారు. ఆ విధంగా విష్ణు దూతలు వచ్చి కాపాడడంతో అజామిళుడు పశ్చాత్తాపం చెంది ఏకాగ్రత చిత్తంతో తన మనస్సును ఆ శ్రీహరిపై నిలిపి గంగా తీరాన స్నానం చేసి, అయ్యో ఇన్నాళ్లూ ఎంత సమయం వృథా చేసుకున్నానని బాధపడి భగవన్నామ స్మరణ చేస్తూ, మోక్షం పొంది వైకుంఠానికి వెళ్లాడని అహోబిల రామానుజ జీయర్ స్వామి వివరించారు. అజామిళుని మాదిరిగా అందరికీ అంత్య సమయంలో భగవన్నామ స్మరణ గుర్తుకు రాదన్నారు. అందుకే మొదటి నుంచి భగవన్నామ స్మరణ అలవరచుకోవాలన్నారు.





