
ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెప్యూటీ సూపరింటెండెండ్ ఇంజినీర్ మల్లెల సాంబశివకుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్థూపాన్ని సందర్శించి ఆవరణలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భట్టిప్రోలులోని అతి పురాతనమైన బుద్ధుని అస్తికలపై నిర్మించిన బౌద్ధస్థూపానికి చరిత్రలో ఎంతో పేరు ఉందని అన్నారు. జాతి సంపదను కాపాడుకునే దిశగా ప్రతి పౌరుడు ఆలోచన చేయాలని కోరారు. పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ దివంగత డాక్టర్ జితేంద్రదాస్ భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, గుంటుపల్లి తదితర బౌద్ధక్షేత్రాల అభివృద్ధికి కృషి చేశాడన్నారు. భట్టిప్రోలు స్థూపం పూర్వాకృతి కోల్పోకుండా ఏర్పాటు చేసిన అండర్ పోర్షన్ మరమ్మతుల ప్రక్రియ ప్రత్యేకంగా గానుగ సున్నంతో చేయిస్తున్నట్లు చెప్పారు. బౌద్ధ స్థూపం చుట్లూ ఫెన్సింగ్ కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు. అండర్ పోర్షన్ కోసం ప్రత్యేకమైన ఇటుకలను నాగార్జున సాగర్ నుంచి తెప్పించడం జరిగిందని చెప్పారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా నిర్మించిన ప్రాచీన కట్టడం సంరక్షణార్ధం 100 మీటర్లలోపు కట్టడాలు పూర్తిగా నిషేధమన్నారు. 100 నుంచి 200 మీటర్ల లోపు కట్టడాలు చేస్తే నేషనల్ మార్నమెంట్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన వెంకట కన్జర్వేషన్ అసిస్టెంట్ యు. వెంకటయ్య, మల్టీ టాస్క్ స్టాఫ్ (ఎంటీఎస్) విక్రమ్ సర్కార్, సిబ్బంది ఉన్నారు.





