NewsProgramms

నా కులము, గోత్రము నీవు కదమ్మా హైందవీ!!

1.5kviews

సామాజిక సమరసతా వేదిక మచిలీపట్నంలో సమరసతా సాహితీ సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి వేదిక స్థానిక అధ్యక్షుడు శ్రీ అంకాని శేషు బాబు అధ్యక్షత వహించారు. సాహితీ ప్రియులు, స్థానిక పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా కృష్ణాజిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి శ్రీ భీమారావు వచ్చారు. “సమాజంలోని అనేక దురాచారాలకు, రుగ్మతలకు తమ రచనల ద్వారా పరిష్కారం చూపిన బోయి భీమన్న, గుర్రం జాషువాలు చిరస్మరణీయులు” అని ఆయన అన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి శ్రీ పోతురాజు గారు భీమన్న గారి కవితా వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా  తన ప్రసంగంలో వర్ణించి శ్రోతలను ఆకట్టుకున్నారు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు సాగిన ఆయన ప్రస్థానాన్ని జనరంజకంగా చెప్పారు. బోయి భీమన్న గారికి పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత జరిగిన మొదటి సన్మానం సమరసతా వేదిక చేయటాన్ని ఆయన శ్రోతలకు గుర్తు చేశారు. 94 సంవత్సరాల జీవితాన్ని సార్ధకం చేసుకొని సాహితీ క్షేత్రంలో ఆయన చేసిన సాహితీ వ్యవసాయ లక్ష్యం సామాజిక సమరసతను సాధించటమే అని చెప్పారు. ఆయన వ్రాసిన “మాలను నేను, విక్రమ కుమారుడ నేను, స్వతంత్ర విప్లవ జ్వాలను నేను, కాంతియు,  దావాగ్నియు నేను. పరాక్రమ మించిననే, శ్రీ లలితాసరస్వతులచే పరమాన్నపు గోరుముద్దలు గ్రోలినవాడ, నా కులము, గోత్రము నీవు కదమ్మా హైందవీ!!”  అనే పద్యాన్ని ఉత్తేజ భరితంగా చెప్పారు. ఆర్ష మతం ఒక్కటే మానవ జీవితానికి ఆదర్శ సత్య దర్శిని అని, ఆనాటి కులాతీత ఆర్ష మతం, పవిత్ర దివ్య వైదిక ఆర్ష విరాట పురుషమూర్తి ఎప్పటికీ నిలిచేదని, దాని పేరుతో ఇప్పుడు పిలవబడుతున్నది ఎండగట్టిన శవం – వట్టి మమ్మీ అని భీమన్న గారు చెప్పినట్లుగా పోతు రాజు గారు చెప్పారు. “ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వు” అనే క్రైస్తవులు యోధ జాతులుగా విజృంభించడం, “ఆయుధం పట్టు, పోరాడు” అనే గీతకు వారసులైన హిందువులు బానిసలుగా బ్రతకడం ఎంత విచిత్రం? దానికి కారణం కర్మ సిద్ధాంతం, కుల వ్యవస్థ అని భీమన్నగారు విశ్లేషించినట్లు చెప్పారు. వివేకానందుని బోధనలతో ఉత్తేజితులైన భీమన్నగారు కుల నిర్మూలన చట్టం తీసుకుని రావాలని ప్రబోధించారు అని పోతు రాజుగారు  చెప్పారు.

తర్వాత మాట్లాడిన విదుషీమణి బండి నాగలక్ష్మి గారు ఒక సరికొత్త ప్రయోగం చేశారు. జాషువా పద్యాల ఆధారంగా కవికోకిల తిరిగి పుడితే ఏ విధంగా స్పందించే వారో చెప్పుకొచ్చారు. విశ్వ నరుడైన జాషువా వినుకొండకు పరిమితం కాదని, పుట్టరాని చోట పుట్టడం తప్పు కాదని, పట్టించుకోవలసిన వారు పట్టించుకోకపోవడం నేరమని, దానివల్లనే కుల ద్వేషాలు కొనసాగుతున్నాయని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణగారి గురువైన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తనకు గండపెండేరం తొడిగి సన్మానించడం తన జీవితంలో మరపురాని ఘట్టం అని చెప్పారు. “అందరమూ పుట్టు పాపులమని అహేతుకంగా భయ బీజాలు నాటి కలత పెట్టి బ్రతుకు మత బోధకులను నమ్మవద్దని, తల్లిదండ్రులు బిడ్డలకు ఎప్పుడూ కులగోత్రాల గురించి, వాటి గొప్పతనాల గురించి నేర్ప కూడదని, శాశ్వతంగా దాస్య భావాలు నిలుపు కథానికములు రచయితలు రచించ కూడదని, అన్నదమ్ముల తనమునకు అడ్డు వచ్చు వీటినన్నిటినీ వదిలి వేయమని, జగన్మృగమును ప్రేమతో ఎదిరించి, సమత్వం కోసం  సంఘటన చేయమ”ని బోధన చేశారు. “భరతమాత ఎంత పచ్చి బాలింతరాలో, ఎంతటి చారిత్రిక వైభవం కలదో జాషువా తన పద్యాలలో తెలియజేస్తూ, సామాజిక అసమానతల వలన ఎన్నో వెన్నెల వాగులు కటిక కొండలమీద ఇంకి పోయాయని, ఎన్నో కోయిల పాటలు చిక్కు చీకటి వనసీమలందు వృధా అయ్యాయని, ఎన్నో కస్తూరి జింకలు మురికి తిన్నెల మీద పరిమళించి ఈడేరి పోయాయని, హెచ్చరిస్తూ జాషువా చేసిన ప్రబోధాన్ని నాగలక్ష్మి చెప్పిన తీరు హృదయాలను హత్తుకుంది.

ప్రముఖ గాయని శ్రీమతి కళ్యాణి గారు బోయి భీమన్న గారు వ్రాసిన “అడవి కాచిన వెన్నెల గాకే అమృత పాత్ర పారవించకే, ఎల తోటలో సెలయేటి తరగలు పిలిచే పిలుపు పెడచెవి నిడకే హృదయమా, కదులుమా” అనే పాటను ఆర్ద్రంగా ఆలపించారు. శ్రీ మడమల రాంబాబు జాషువా పద్యాలను కమనీయంగా పాడారు. ముఖ్యంగా  “ఇచ్చోటనే  భూమిలేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే” అనే పద్యం పాడి శ్రోతలకు కళ్ళనీళ్ళు తెప్పించారు. కార్యదర్శి శ్రీ అంకెం జితేంద్ర వందన సమర్పణతో సభ ముగిసింది. సభలో ఇంకా సామాజిక సమరసతా వేదిక జిల్లా కన్వీనర్ శ్రీ వడ్డి జితేంద్ర, డాక్టర్ బి. సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.