
తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆస్థాన మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రణేతలలో ఒకరైన విఖనస మహర్షి శిష్యుడైన శ్రీ కశ్యప మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విఖనస స్తోత్ర పాఠ పారాయణం, మంగళ నిరాజనాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం వైఖానస పండితుల ప్రసంగాలు, చర్చాగోష్ఠి నిర్వహించారు.
‘కశ్యప జ్ఞానకాండ’ ప్రత్యేకత
భగవత్ శాస్త్ర పరంపరలో శ్రీ కశ్యప మహర్షి రచించిన ‘కశ్యప జ్ఞానకాండ’ గ్రంథ విశిష్టతను పండితులు వివరించారు. శ్రీవారి ఆరాధనా విధానంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది వైఖానస దేవాలయాల్లో ఈ గ్రంథం ప్రామాణికంగా ఉపయోగంలో ఉందని తెలిపారు.
వైఖానస ఆగమ సంప్రదాయంలో ‘కశ్యప జ్ఞానకాండ’కు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. పూజ్య పండితులు రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల పరిష్కరణతో ఈ గ్రంథాన్ని టీటీడీ ముద్రించి భక్తులు, పండితులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.
ఆధ్యాత్మిక సంప్రదాయాలతో సంస్కారం
వైఖానస భగవత్ శాస్త్ర జ్ఞానం, దేవాలయ సంస్కృతితో ముడిపడిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతున్నాయని వక్తలు పేర్కొన్నారు. సత్ప్రవర్తనతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఈ సంప్రదాయాలు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి తిరుమల శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీమాన్ గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. నారాయణం తనూజ విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డా. నారాయణం కాకుమాను సిద్ధాంతి, అలంకారరత్న శ్రీమాన్ ఎన్.వి.ఎన్. దీక్షితులు, శ్రీమాన్ GVLN శ్రావణ్ కుమార్ వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ గోవర్ధనం రఘునాథ్, వైఖానస విద్యార్థులు, పండితులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





