
ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి అరెస్టు, బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపుల దాడులకు తెగబడుతున్నాయని.. ఈ క్రమంలోనే తాజాగా ఘటన జరగడంపై ఆందోళనకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. మైనార్టీల ఇళ్లలో దోపిడీ, వ్యాపార సంస్థల్లో విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కాకుండా.. శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్‌ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది.
కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు విషయంలో జోక్యం చేసుకొని, ఆయన్ను విడిపించాలని ఇస్కాన్ ఆలయ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ‘ఇస్కాన్‌కు చెందిన కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు అరెస్టు చేశారనే వార్తలను మేము చూశాం. అక్కడి అధికారులు ఇస్కాన్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి.. మాది శాంతి, ప్రేమగల భక్తి ఉద్యమం అని తెలపాలి. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఇస్కాన్ ‘ఎక్స్’లో పేర్కొంది.





