News

రేపటి నుంచి లోక్‌మంథన్‌

309views

హైదరాబాద్‌ శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు లోక్‌మంథన్‌-2024 నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గువాహటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్‌లో పెద్దఎత్తున చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ‘ప్రజ్ఞాప్రవాహ్‌’ సమన్వయకర్త నందకుమార్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘21వ తేదీన లోక్‌మంథన్‌లో ప్రదర్శనలు, సాంస్కృతిక ఉత్సవాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభమవుతాయి. 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు. లోక్‌మంథన్‌లో 100కిపైగా కళలు, 1,500 మందికిపైగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. 400కుపైగా అరుదైన భారతీయ సంగీత పరికరాలతో వాద్యకచేరి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో విభజనపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. కుట్రపూరితమైన ఈ వ్యవహారాలను ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఈసారి లోక్‌మంథన్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేసి, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపడమే లక్ష్యం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

13 కీలక అంశాలపై మేధోమథనం
విజ్ఞాన్‌ప్రవాహ్‌ సమన్వయకర్త నందకిశోర్‌ మాట్లాడుతూ మన భవిష్యత్తు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు తదితర 13 కీలక అంశాలపై లోక్‌మంథన్‌లో చర్చిస్తామన్నారు. 24న జరిగే ముగింపు కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌భాగవత్‌ ప్రసంగిస్తారని వెల్లడించారు.