
పర్యావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యమని ఆర్. ఎస్. ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఒంగోలు AKVK కళాశాలలో జరిగిన ఆరెస్సెస్ నగర సాంఘిక్ లో శ్రీ భరత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు శ్రీ తాతా వెంకట చెంచయ్య గుప్తా ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమములో ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ముఖ్యవక్తగా సందేశం అందించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సామాజిక పరివర్తన కోసం చేసిన అనేక ప్రయత్నాలలో విజయం సాధించిందని, ఇంకా అనేక రంగాలలో పరివర్తన, వికాసం సాధించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. అందుకోసమే సంఘం ఈ ఏడాది ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ అనే రెండు గతి విధులను అదనంగా స్వీకరించి ఆయా విషయాలలో పరివర్తన సాధించటం కోసం ప్రయత్నిస్తోందన్నారు.

పర్యావరణ, జల సంరక్షణ ఆవశ్యకతను ఇంటింటికీ, గుండె గుండెకు చేరువ చెయ్యవలసిన బాధ్యత ప్రతి స్వయంసేవక్ కు ఉన్నదని శ్రీ భరత్ కుమార్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని భద్రంగా కాపాడడమే మనం మన భావితరాలకు అందించే గొప్పకానుక అన్నారు. పర్యావరణాన్ని, జలాలను సంరక్షించాలన్న ఆరెస్సెస్ సందేశాన్ని ఇంటింటికీ చేర్చాలని, అందుకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర స్వయంసేవకులు 218 మంది పాల్గొనగా, 140 మంది ABVP కార్యకర్తలు కూడా కార్యక్రమంలో ఉండటం విశేషం. తదనంతరం సేవాభారతి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీ భరత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆరెస్సెస్, సేవాభారతిల సంయుక్త ఆధ్వర్యంలో నగర ప్రజలకు తులసి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.







