“గావో విశ్వస్య మాతరః” అన్నారు మన పెద్దలు. ఒక్క గోమాత మన ఇంట ఉంటే డాక్టరుతో పెద్ద అవసరం రాదు అని కూడా చెబుతారు. “పంచ గవ్య చికిత్సా విధానం“ పేరుతో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో గోవు నుంచి ఉత్పత్తయ్యే పంచ గవ్యములతో [గో క్షీరము, గో మూత్రము, గో మయము (పేడ), గో ధ్రుతము (నెయ్యి), గో దధి (పెరుగు)] ఒక అద్భుతమైన వైద్య విధానమున్నది. గోవు ద్వారా 108 రోగాలను నయం చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. అందుకే భారత దేశంలో గోవును తల్లిగా భావించి పూజిస్తాం.
ఇంతకీ విషయమేమిటంటే నెల్లూరు నగరంలోని కొత్తూరు శాఖ స్వయం సేవకులకు తమ శాఖ జరిగే చోటుకి సమీపంలో ఒక గోమాత మరణించి ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే ఆ శాఖా ముఖ్య శిక్షక్ కు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. గోవు మరణించినా సరే ఆ గోవు కళేబరాన్ని పూడ్చిన చోటి మట్టి పొలానికి ఎరువులా పనికొస్తుందని, ఆ చోటు పవిత్రము, విష రహితము అవుతుందని పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చింది. అందుకే తన శాఖా సహచరులతో మాట్లాడి ఆ గోమాత కళేబరాన్ని ఎక్కడైనా పూడ్చాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే దాని కోసం స్థలాన్ని నిర్ణయించడం, గొయ్యి త్రవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఆ శాఖా స్వయంసేవకులందరూ కలిసి ఆ గోమాత కళేబరాన్ని “వందే గోమాతరం” అని నినదిస్తూ మోసుకొచ్చి శాస్త్రోక్తంగా ఖననం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికుడొకరు “పూర్వం మన పెద్దలు గోమాత పట్ల ఇలాగే శ్రద్ధ చూపే వారు. ఇప్పుడీ పిల్లలకున్న భక్తి చూస్తుంటే ముచ్చటేస్తోంది.” అన్నారు. “మరింకేంటనుకున్నావ్? వాళ్ళంతా ఆరెస్సెస్ స్వయంసేవకులు. ఆరెస్సెస్ కి వెళితే ఇలాంటి సంస్కారాలే అబ్బుతాయ్.” అన్నాడు ఇంకో పెద్ద మనిషి.