News

మన్యంలో మ్రోగిన తుపాకీ – ఐదుగురు మావోయిస్టులు మృతి

516views

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహించాయి. గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్‌ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలిలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. తుపాకులతో పాటు, కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 23న మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మరణించారు. వారు మృతిచెంది రేపటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. దీనికి ఒక్కరోజు ముందు ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.