News

ప్రారంభమైన భవానీ దీక్షాధారణలు .. భవానీ దీక్షల చరిత్ర ఇదే

276views

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ఏడాది మొత్తం కూడా విజయవాడ కనకదుర్గమ్మను పూజిస్తారు. అయితే ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం అయ్యాయి. భవానీ దీక్ష వేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇంట్లో ఉండటంతో పాటు పాపాలు అన్ని తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

మొత్తం 40 రోజుల పాటు..
ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ప్రారంభమయ్యి.. మొత్తం 40 రోజుల పాటు దీక్షలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ మాలను ధరిస్తారు. దుర్గగుడిలో 1979లో ఈ భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలు అర్దమండల విరమణ డిసెంబర్ 5న ముగిస్తుంది. పూర్తి దీక్ష విరమణ డిసెంబర్ 25తో ముగిస్తుంది.

భక్తులు భవానీ దీక్షలను స్వీకరించేందుకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద, ఘాట్‌రోడ్డు ఆరంభంలోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు గురు భవానీల పీఠాల వద్ద దీక్షలను స్వీకరించవచ్చు.

భవానీ దీక్షల చరిత్ర ఇదే
1979లో దుర్గగుడి ప్రధానార్చకులు లింగంభొట్ల రామకృష్ణ శర్మ విన్నపంపై కంచికామకోటి పీఠాధిపతుల ఆదేశంతో 1979-80 కార్తీక పౌర్ణమి రోజు రాచకొండ కామేశ్వర శర్మ చేతుల మీదుగా ఈ దీక్షలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి క్రమక్రమంగా దీక్షలు స్వీకరించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఐదారు లక్షల మందికి తక్కువ కాకుండా ఈ దీక్షలు చేపడుతున్నారు. దీక్షలు స్వీకరించే వారి సంఖ్య ఏ ఏటికాయేడు పెరుగుతూ ఉంది.