
శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆలయానికి సమీపంలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి అలర్ట్ అయ్యారు. వెంటనే డ్రోన్ ఎగురుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు కనిపించారు.
ఆలయ అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఇక్కడ ఎందుకు ఎగరవేస్తున్నారని వారిని అధికారులు ప్రశ్నించారు. శ్రీశైలం ఆలయ పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించారని హెచ్చరించారు. వెంటనే డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. ఆ ఇద్దర్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
గతంలో కూడా శ్రీశైలం సమీపంలో డ్రోన్‌లు ఎగురవేసిన ఘటనలు ఉన్నాయి. రాత్రి వేళల్లో వరుసగా డ్రోన్‌లు ఎగురవేశారు.. అయితే వారిని గుర్తించేలోపు వారు పారిపోయారు. మళ్లీ ఇప్పుడు డ్రోన్ కలకలం రేపింది. వీరు శ్రీశైలం వచ్చిన భక్తులని తెలుస్తోంది. ఆలయం సమీపంలో ఇలా డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపింది.





