News

పాక్ లో రోడ్లపైకి జనం… విద్యుత్, నీటి సమస్య పరిష్కరణకు డిమాండ్

340views

నిత్యం భారత్ పై అకారణంగా కాలుదువ్వే పాకిస్తాన్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. విద్యుత్ కోతలు, నీటి కొరత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కరాచీ రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరాచీలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన లియారీ ఎక్స్ ప్రెస్ హైవే పై ప్రజలు ధర్నా నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ప్రతి రోజూ 12 గంటల మేర విద్యుత్ కొరత ఏర్పడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సమయంలోనూ కరెంట్ కోతలు వుంటాయో కూడా ప్రభుత్వం ప్రకటించడం లేదని, ఓ ప్రణాళికా పాడూ ఏమీ లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము పదే పదే విద్యుత్ అధికారులకు ఈ సమస్యను తీసుకెళ్లినా…. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంట్ కోతలకు వెంటనే స్వస్తి పలికి, ఓ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే నీటి కొరత కూడా తీవ్రంగా ఏర్పడిందని, దీనిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా తిరిగి సాధారణ స్థాయికి వచ్చే వరకు విద్యుత్ బిల్లులను చెల్లించే ప్రసక్తే లేదని నేతలు ప్రకటించారు.ఆందోళన పెరగడం, ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో శాంతియుతంగానే పోలీసులు అక్కడి నుంచి నిరసనకారులను పంపించారు. తిరిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టింది.