
నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం
పవిత్ర కార్తిక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవంస్వామికి పుష్పయాగం నిర్వహిస్తారు. సువాసనలు వెదజల్లే వివిధ పుష్ప, పత్రాలతో శ్రీదేవీభూదేవీ సమేత శ్రీమలయప్ప స్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయ సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో కనులపండుగగా జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో మొదలై మధ్యలో కొంతకాలం నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని 1980లో పునరుద్ధరించారు.
పుష్పయాగం రోజున ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు ఉత్సవం కొనసాగుతుంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేస్తారు. చామంతి, సంపంగి, జాజి, పొగడ, గులాబి, గన్నేరు, కనకాంబరం, మల్లెలు, తామర, కలువ, మొగలి, సంపంగి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం తదితర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, కదిరిపచ్చ పత్రాలను అర్పిస్తారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామ, అధర్వణ వేదాలను పఠిస్తారు.
పుష్పయాగానికి 8 టన్నుల పుష్పపత్రాలను వినియోగిస్తారు. ముందుగా ఉదయం ఉద్యానవన విభాగం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు పుష్పాల ఊరేగింపు వైభవంగా జరుగుతుంది. శ్రీమలయప్పస్వామికి 20సార్లు వివిధ రకాల పుష్పాలను అర్పిస్తారు. విగ్రహాలకు నిలువెత్తు వరకు పుష్ప నివేదన చేస్తారు. అనంతరం స్వామి దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొంటారు. తర్వాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. రంగు రంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం చూసి తరించాల్సిందే. పుష్ప యాగానికి పూలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన దాతలు విరాళంగా అందిస్తారు.





