News

హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ”సేవా మేళా”

242views

హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 10 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హిందూ ఆధ్యాత్మిక సేవా మేళా జరగనుంది. ఈ విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఈ మేళాకి సంబంధించిన మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 7 న ఎగ్జిబిషన్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు త్రిదండ శ్రీమన్నారాయణ రామనుజ చిన జీయరు స్వామి ఈ మేళా ను ప్రారంభిస్తారని తెలిపారు. వీరితో పాటు రామకృష్ణ మఠం స్వామీజీ స్వామీ శితికంఠానంద, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వుంటారన్నారు.

అలాగే వక్తలుగా ఆరెస్సెస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు, ప్రచారక్ భాగయ్య, IMCTF, HSSF అఖిల భారత సంయోజకులు గుణవంత్ కొఠారి కూడా పాల్గొంటున్నారు. కార్యక్రమం ముగింపులో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్ పరమవీర్ వందన్ కార్యక్రమంలో ప్రసంగిస్తారని తెలిపారు. మరోవైపు ఇప్పటికే తాము చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీతో పాటు ప్రధాన నగరాల్లో ఈ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో మాత్రం ఇదే ప్రథమమని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, ప్రవేశం ఉచితమని తెలిపారు.

మరోవైపు IMCTF ద్వారా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా సంగీత, నృత్యాలు, సంస్కారాలు, స్ఫూర్తి ప్రేరణాదాయక కార్యక్రమాలు, విద్యార్థుల కోసం కార్యక్రమాలు, ఆటలు, పాటలు, ప్రముఖులచే సందేశాల రూపకల్పన చేశామన్నారు.