
పార్వతీపురం మన్యం జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవీ రమణ హెచ్చరించారు. పెదమానాపురం పశువైద్యాధికారి దినేష్ ఆధ్వర్యంలో సంతలో పశువుల వ్యాపారులకు రవాణాపై శనివారం అవగాహన కల్పించారు. ఆవులు అక్రమ రవాణా నిలిపివేశామని, చిన్న వ్యాన్లలో రెండు నుంచి మూడు పశువులు, మినీ వ్యాన్లలో నాలుగు నుంచి ఆరు పశువులు మాత్రమే తరలించాలని అన్నారు. అనారోగ్యం పాలైన పశువులను కబేళాలకు తరలించాలని ఏ ఒక్క వ్యాపారికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్, పంచాయతీ అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని జేడీ తెలిపారు. తక్కువ ఆశీలు వసూలు చేసి సంత యజమానులు అన్ని సౌకర్యాలు కల్పించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంతలో సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏజేడీ చంద్రశేఖర్, సంత నిర్వాహకులు రామునాయుడు, తిరుపతినాయుడు, గోవింద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



