ArticlesNews

పదండి.. కార్తీకంలోకి..

269views

ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. చేర నీ పాద దీపం కర్పూర దీపం.. కార్తీక మాసం అంటే అంత ప్రత్యేకత మరి.. కార్తీక మాసంలో చేసే స్నాన, జప, తప, దాన, వ్రతాలకు అనంతమైన పుణ్యఫలితాలు వస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.. అందుకే ఏడాదంతా ఎలా ఉన్నా.. ఆ శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఈనెలంతా ఆధ్యాత్మికత ఆనందకరమైన వాతావరణమే.. కార్తీక మాసం వచ్చిందంటే ఆ సందడే వేరు.. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలాల్సిందే.. ఆ శివయ్యను కనులారా చూడాల్సిందే.. దీనికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేనన్ని ప్రధాన శైవ క్షేత్రాలు ఉన్నాయి.. ఒక పక్క పంచారామ క్షేత్రాలు.. సామర్లకోట కుమారరామం.. ద్రాక్షారామ భీమేశ్వరుడు.. పాదగయ.. ఇంకో పక్క ఏకాదశ రుద్రులు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నెన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.. కార్తీకం అంటే హరిహరులకు ఎంతో ప్రీతికరం.. ఈ మాసంలో అన్నవరంలో చేసే గిరి ప్రదక్షిణ ప్రత్యేకమే.. కార్తీక దీపాలు వదిలేందుకు వచ్చే భక్తులతో గోదావరి ఘాట్లు కళకళలాడతాయి. హరోం.. హర.. హరహర మహాదేవ శంభో శంకర.. నినాదాలతో మారుమోగుతాయి.. ఈ క్షేత్రాలన్నీ చూడగలమా అంటారా.. ఎందుకు చూడలేరు.. ఆర్టీసీ నుంచి ప్రత్యేక దర్శనయాత్రలు ఉన్నాయి.. ఇక్కడినుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు.. ఇంతేనా అంటే.. ఇక కుటుంబీకులతో సరదాగా గడిపే వన భోజనాలకు ఈ మాసమే అనుకూలం.. అందుకే ఈ నెలంతా ఆధ్యాత్మికం.. ఆనందం..

కార్తీకమాసం ఆరంభం. ఈనెలంతా ఒక ఆధ్యాత్మిక యాత్రలా సాగుతుంది. సూర్యోదయంలోపు స్నానాలు.. పూజలు… అభిషేకాలు, దీపారాధనలు, ఉపవాసాలు.. ఎక్కడ చూసినా భక్తి కార్యక్రమాలే కనిపిస్తాయి. మరోవైపు మాలధారణలు, అనేక సంప్రదాయాలు ఆధ్యాత్మికతకు అద్దంపడతాయి. హైటెక్‌ కాలంలోనూ భక్తజనం క్రమం తప్పకుండా పాటిస్తున్న ఆచార వ్యవహారాలు మరోవైపు. వనభోజనాల సందడి ఇంకోవైపు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావడంతో దాదాపుగా అన్ని ఆలయాల్లో పూజాధికాలు నిర్వహిస్తారు. నోములు, కార్తీక పౌర్ణమి పర్వదినాల జ్వాలాతోరణం తదితర విశేష కార్యక్రమాలు సరేసరి. అటు మంచుతో కూడిన చల్లని వాతావరణం, మదిని దోచే ప్రకృతి రమణీయత.. ఇటు ఆధ్యాత్మిక తన్మయం కలగలిసిన ఈ కాలానికి శుభోదయం..

కార్తీకమాసం మహోత్సవాలకు పంచారామ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. ఇందులో ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాల యం ఇప్పటికే ముస్తాబైంది. స్వయంభువు అయిన భీమేశ్వరస్వామివారు, అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశశక్తి పీఠం మాణిక్యాంబ అమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భీమేశ్వరస్వామికి అభి షేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిత్యం చేస్తుంటారు. ఈ మేరకు భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శనానికి ఆలయ సహాయ కమిషనరు ఈవో అల్లు వెంకట దుర్గాభవానీ ఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారిదర్శనం, అభిషేకాలు ప్రారంభం అవుతాయి. రాత్రి భక్తులు రాకను బట్టి దర్శనం గడువు 12 గంటల వరకు ఉంటుంది. ఇక సామర్లకోట భీమేశ్వరాలయం కార్తీక మాసోత్సవాలకు సిద్ధమైంది. శుక్రవారం రాత్రి వేదపండితులు ఆలయ ధ్వజస్తంభం వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆకాశదీప పూజలను ఘనంగా ప్రారంభించారు. శనివారం తెల్లవారు జాము నుంచి తొలి అభిషేక పూజలతో కార్తీక మాసం సంపూర్తిగా ప్రారంభవుతుందని కు మారరామ భీమేశ్వరాలయం అభిషేక పండిట్‌ వేమూరి సోమేశ్వరశర్మ తెలిపారు.

నెలంతా.. ఆకాశదీపం
పవిత్ర కార్తీకమాస ప్రారంభసూచికగా శుక్రవారం రాత్రి పాఢ్యమి తిథి తగలడంతో సత్యదేవుడి సన్నిధిలో ఆకాశదీపం ఏర్పాటు చేశారు. అనివేటి మండపంలో ప్రత్యేక పూజలు చేసి నలుదిక్కులా దర్శించేలా నాలుగు దీపాల ను ఏర్పాటు చేసి ప్రత్యేక తాళ్లతో ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటుచేశారు. సామర్లకోట కుమారరామంలో కూడా ఆకాశదీపం ఏర్పాటు చేశారు. కార్తీకమాసం నెలరోజులూ ఈ ఆకాశదీపం వెలుగుతూ ఉంటుంది. భక్తులు ఆకాశదీపం దర్శించుకుంటే జీవితంలో చీకట్లు తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు పేర్కొన్నారు.

పర్వదినాలకు నెలవు!
శివకేశవులకు బేధం లేదని చెప్పే కార్తీకమాసం శనివారం నుంచి ప్రారంభమవుతుంది. శివకేశవులకు ప్రీతిదాయకమైన మాసంగా చెబుతారు. ఈనెల 2 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు కార్తీకమాసమని బండారులంకకు చెందిన ప్రముఖ పంచాంగకర్త కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి తెలిపారు. కార్తీకమాసంలో శివుడిని, విష్ణువును ఆరాధిస్తారు. మాసాధిపతి అయిన దామోదరుని పూజించి కేదారేశ్వరుని వ్రతం చేసుకోవడంతోపాటు చిలుకు ద్వాదశి నాడు సాలగ్రామం దానం చేయడం విశేష పుణ్య ఫలితమని చెప్పారు. ఈనెలలో 4, 11, 18, 25 తేదీలు కార్తీక సోమవారం రోజున శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. 15న కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. అట్లతద్ది వాయనాలు తీర్చుకోనివారు కార్తీక సోమవారం, పౌర్ణమి తిథిలో తద్ది వాయనాలు తీర్చుకున్న తరువాత నోము పట్టవచ్చు. ఈనెల 2న భగినీ హస్త భోజనం, 5న నాగులచవితి, 8న యాజ్ఞవల్క మహర్షి జయంతి, 9న గోపాష్టమి, 12న బోధన ఏకాదశి, 13న చిలుకుద్వాదశి-క్షీరాబ్ధిపూజ, 14న వైకుంఠ చతుర్దశి, 15న కార్తీక పౌర్ణమి-జ్వాలాతోరణం, 18న సంకష్టహరచతుర్థి, 23న సత్యసాయిబాబా జన్మదినం, 29న మాసశివరాత్రి, డిసెంబరు 1 అమావాస్యతో కార్తీకమాసం పూర్తవుతుంది. ఈమాసంలో చేసే స్నాన, జప, తప, దాన, వ్రతాలకు అనంతమైన పుణ్యఫలితాలు కలగ చేస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.

వివాహాది శుభ ముహుర్తాలు..
కార్తీకమాసంలో ఆలయాలన్నీ భక్తులతో కిట కిటలాడతాయి. అదేవిధంగా వివాహాది శుభ ముహుర్తాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నెలలో 3, 6, 9, 10, 13, 14, 22 తేదీల్లో వివాహాలకు ముహుర్తాలు ఉన్నాయి. ఇక 4, 10, 11, 13, 14, 17, 20, 24 తేదీల్లో శంకుస్థాపనలు, 3, 4, 9, 10, 11, 13, 17, 20, 24, 25 తేదీల్లో గృహ ప్రవేశాలకు మంచి ముహుర్తాలు ఉన్నాయని భీమేశ్వరరావు సిద్ధాంతి తెలిపారు.

అన్నవరంలో ‘గిరిప్రదక్షిణ’
కార్తీకం అంటే హరిహరులకు ఎంతో ప్రీతికరం. హరిహరక్షేత్రంగా భక్తకోటి నీరాజనాలు అందుకుంటున్న అన్న వరం పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం పురస్కరించుకుని సుమారు 15 లక్షల మంది భక్తులు స్వామివారి సన్ని ధికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. 1.50 లక్షల వ్రతాలు జరుగుతాయి. కార్తీకమాసంలో సత్యదేవుడి గిరిప్రదక్షిణ జరగనుండగా 1.30 లక్షలమంది పాల్గొంటారు. స్వామివారి తెప్పోత్సవానికి 50 వేలమంది విచ్చేస్తారు. దీంతో ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాల కల్పనకు రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లో సిట్టింగ్‌, ఫ్యాన్లు ఏర్పా టు చేస్తున్నారు. రూ.17.50 లక్షలతో ప్రస్తుతం ఉన్న క్యూలైన్‌కు అదనంగా 100 అడుగులు పొడవుతో రెం డు వరసల్లో అదనంగా మరో 1200మందికి వీలుగా ఈ క్యూలైన్‌ను నిర్మించినట్టు ఈవో రామచంద్రమోహన్‌ తెలిపారు. పాడైన ఘాట్‌రోడ్డులో బీటీ రోడ్డుకు రూ.40 లక్షల వ్యయం చేశారు. రూ.12.50 లక్షలతో భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణగా వాటర్‌ప్రూఫ్‌ షామియానాలు సిద్ధంగా ఉంచారు. రూ.39లక్షలతో వివిధ సత్రం గదుల్లో పాడైన పరుపులు, మం చాలు పిల్లోస్‌ కొత్తవి ఏర్పాటుచేశారు. రూ.3.50 లక్షలతో ప్రకాశ్‌సదన్‌ వెనుక, వనదుర్గ ఆలయం, గిరిప్రదక్షిణ మార్గాల్లో మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు, రత్నగిరినుంచి సత్యగిరి కొండకు రూ.15లక్షలతో మెట్లమార్గం ఏర్పాటు రూ.5లక్షల వ్యయంతో తెప్పోత్సవం రోజున హంసవాహనం తీర్చిదిద్దేందుకు, రూ.9.50 లక్షలతో అదనపు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. గిరిప్రదక్షిణ రోజున రూ.3 లక్షలతో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. సీ ఆర్వో కార్యాలయం ఎదురుగా 1000మంది బసచేసేందుకు వీలుగా ఉచిత డార్మెటరీ, లాకర్లను సిద్ధంగా ఉంచినట్టు ఈవో తెలిపారు. కార్తీకమాసంలో 14 రోజులు పర్వదినాలుగా గుర్తించగా, ఆయా రోజుల్లో ఒంటి గంట నుంచి వ్రతాలు రెండు గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తామని ఈవో తెలిపారు.

దీపారాధన…
శివనామస్మరణ చేస్తూ ఒత్తులను తయారు చేసి రోజుకు ఒకటి చొప్పున మొత్తంగా 365 ఒత్తులతో శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో ఐదు రోజుల్లో ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు తులసీ వివాహం, వైకుంఠ చతుర్ధశినాడు ఉసిరి చెట్టుకింద దీపరాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. విష్ణుమూర్తికి ఇష్టమైన పౌర్ణమి రోజున స్నానాలు ఆచరించి సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు.

పాదగయ.. ముస్తాబు
పిఠాపురం పాదగయ క్షేత్రానికి కార్తీకమాసం నెలరోజులపాటు భక్తులు పోటెత్తుతారు. సోమవారా లు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి పర్వదినాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. కార్తీకమా సం తొలిరోజు శనివారం తెల్లవారుజామున రెం డు గంటల నుంచి పాదగయ పుష్కరిణిలో పు ణ్యస్నానాలు ఆచరించి పాఢ్యమి దీపాలు వెలిగించడం ద్వారా కార్తీకమాస నోములను భక్తు లు ప్రారంభానికి నాంది పలికారు.ఇళ్లవద్ద, ఆల యాల్లో పూజల్లో చేసే భక్తులంతా పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం సం ప్రదాయం వస్తోంది. నెలరోజులపాటు పాదగయక్షేత్రంలోని రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక పూజ లు జరుగుతాయి. ప్రతి నిత్యం స్వయంభూ లింగమూర్తి అయిన కుక్కుటేశునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో దశమిశక్తి పీఠం అధిష్టాన దేవతైన పుర్హుతికాఅమ్మవారికి, రాజరాజేశ్వరీదేవికి కుంకుమ పూజలు జరుగుతాయి. ఈనెల రోజులూ శనివారం నుంచి డిసెంబరు 1 వరకూ ప్రతి రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుందని ఈవో కాట్నం జగన్మోన శ్రీనివాస్‌ తెలియజేశారు.

రాజమహేంద్రిలో ఘాట్లన్నీ రెడీ
కార్తీక మాసంలో గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక స్నానమాచరిస్తారు. రాజమహేంద్రవరంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను నగరపాలక సంస్థ పూర్తిచేశారు. పవిత్రగోదావరి నదీలో కార్తీ స్నా నాలచరించే భక్తుల కోసం పది రేవులను సిద్ధం చేశారు. రేవులను శుభ్రపరిచి బ్లీచింగ్‌ చల్లి రేవు ల్లో నీటిలో ఉన్న నాచు, ఇతర వ్యర్థాలను తీసి వేశారు. రాజమహేంద్రవరంలో కోటిలింగాల రేవు, చింతాలమ్మఘాట్‌, పద్మావతి ఘాట్‌, పు ష్కరాలరేవు, టీటీడీ ఘాట్‌, మార్కండేయఘా ట్‌, శ్రద్ధానంద ఘాట్‌, పిండాలరేవు, సరస్వతి ఘాట్‌, గౌతమిఘాట్‌ తదితర రేవులను భక్తుల స్నానాలకు సిద్ధంచేశారు. రాజమహేంద్రవరం, రూరల్‌ పరిధిలో ఉన్న 11 రేవులలో పది రేవు లు మాత్రమే స్నానాలకు అనుకూలంగా ఉం టాయి వాటిని రెడీచేశారు. రాజమహేంద్రవరం లో స్నానాల రేవుల్లో పనిచేయడానికి నగరపాలక సంస్ధ పారిశుధ్యవిభాగంలో అదనంగా 90 మంది కార్మికులను ఏర్పాటుచేశారు. నగరపాలకసంస్థ రెగ్యులర్‌ కార్మికులతోపాటు అద నంగా వీరు పనిచేస్తారు. రేవులో రెండు షిప్టుల విదానంలో కార్మికులు పనిచేస్తారని శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంద్రగంటి శ్రీనివాస్‌ తెలిపారు.

ఏకాదశ రుద్రుల దర్శనయాత్ర
ఏకాదశ రుద్రుల శైవక్షేత్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో కార్తీకమాసం సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. 450 శతాబ్దాల చరిత్ర కలిగిన జగన్నతోట ప్రభల ఉత్సవానికి 2020లో ప్రధాని మోదీ ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలంటూ అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంనకు చెందిన శివకేశయూత్‌ సభ్యులకు లేఖ ను రాశారు. అలాగే శృంగేరీ పీఠాధిపతి ఏకాదశ రుద్రులపై లేఖను అందించారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన 74వ రిపబ్లిక్‌ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏకాదశ రుద్రు ప్రభల శకటం వెళ్ల డంతో జాతీయ స్ధాయిలో మరింత గుర్తింపు లభించింది. దీంతో కార్తీకమాసం సందర్భంగా ఏకాదశ రుద్రుల దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఏకాదశ రుద్రులు డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబా జీపేట, అయినవిల్లి మండలాల్లో కొలువై ఉన్నా రు. అంబాజీపేట మండలంలో సుమారు 9 గ్రా మాలుండగా అయినవిల్లి, అమలాపురం మండలాలలో నేదునూరు, పాలగుమ్మి గ్రామాలు న్నాయి. కార్తీకమాసంతోపాటు ఇతర రోజు ల్లో ఏకాదశ రుద్రులను ఒకేరోజు దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమని పండితులు చెబుతారు. వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వా మి (విశ్వేశ్వరరుద్రుడు), గంగలకుర్రు అగ్ర హారం వీరేశ్వరస్వామి(సర్వేశ్వరరుద్రుడు), నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి(తికాగ్నికాలరుద్రుడు), కె.పెదపూడి మేనకేశ్వరుడు (మహాదేవ రుద్రుడు), పుల్లేటికుర్రు అభిన వ వ్యాఘ్రేశ్వరస్వామి(శ్రీమన్మహాదేవరుద్రు డు), ముక్కామల రాఘవేశ్వరస్వామి(కాలాగ్ని రుద్రుడు), వక్కలంక విశ్వేరస్వామి(త్రిపురాంతక రుద్రుడు), మొసలపల్లి మధుమానాంత భోగేశ్వరస్వామి(నీలకంఠ రుద్రుడు), పాలగుమ్మి చెన్నమల్లేశ్వరుడు(మృత్యుంజయ రుద్రుడు), గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి (సదాశివరుద్రుడు), ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి (త్య్రంబకేశ్వర రుద్రుడు)లను దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమని చెబుతున్నారు.

కొవ్వూరు డిపో నుంచి ప్రత్యేక బస్సులు
ఏకాదశ రుద్రుల దర్శనం కోసం కొవ్వూరు ఆర్టీసీ డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. గతేడాది కూడా కొవ్వూరు డిపో నుంచి 100 బస్సుల వరకు రావడంతో ఈ ఏడాది దర్శనాల కోసం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దర్శనాల కోసం సోషల్‌మీడియా ద్వారా ప్రచారం నిర్వ హించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అల్పాహారం, విందు ఏర్పాటుచేసేందుకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక బస్సులను కొవ్వూరు డిపో నుంచి వస్తాయి.

వనభోజనంతో పాప విముక్తి..
కార్తీక మాసంలో వనభోజనాలు అధికంగా ఉసిరిచెట్టు కింద సమారాధన చేసి బంధువులు, మిత్రులతో భోజనం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని.. ఉసరిక ఉన్న వనంలో భోజనంచేస్తే పాప విముక్తులై విష్ణులోకానికి వెళ్తారని అనేది భక్తుల నమ్మకం. ఈ మాసంలో తెల్లవారుజామున మహిళలు తెల్లవారుజామునే నిద్రలేవడం, పసుపు రాసుకోవడం, చల్లని నీటితో స్నానం చేయడం, తులసి మొక్కకు నీళ్లు పోసి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలాంటివి ఇందుకు ఉపయోగపడతాయి. అల్పాహారం, మధ్యా హ్నం మిత భోజనం, రాత్రికి పండ్లు, పాలు వంటివి తీసుకోవడం, సమష్టిగా వనభోజనాలు చేయడం, ప్రకృతి ఒడిలో సేదతీరడం సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.