
ప్రకృతితో మమేకం చేస్తుంది వనభోజనం. విగ్రహారాధనకు ముందు వనాలు, కొండలు, నదులు, సముద్రాలు, తటాకాలు, చెట్టుచేమలు ఇలా ప్రకృతినే ఆరాధించేవారు. ఇవన్నీ జీవకోటికి ప్రాణాధారం. కూడు, గూడు, వస్త్రాలను ప్రసాదించే వృక్షాలు ప్రత్యక్ష దేవతలు. ఇన్నిటిని మనకందించే చెట్ల నీడలో భుజించటం శ్రేష్ఠమని, ముఖ్యంగా చల్లని గాలితో ఆహ్లాదం కలిగించే కార్తికమాసంలో విశేషించి ఉసిరికచెట్టు కింద భోజనం చేయటం మంచిదని- దాన్నొక ఆచారంగా ఆదేశించారు.
సర్వపాప విముక్త్యర్థం వనభోజన ముత్తమం – అని స్కాంద పురాణం స్పష్టం చేసింది. పాపాల నుంచి విముక్తి పొందే మార్గాల్లో వనభోజనం శ్రేష్ఠమని దీని భావం. అన్ని మాసాల్లోకీ కార్తికం మహోన్నతం. కనుకనే-
న కార్తిక సమో మాసః న కృతేన సమం యుగం
న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమః
అన్నారు. గంగతో సమమైన తీర్థం, వేదంతో సమమైన శాస్త్రం, కృతయుగంతో సమమైన యుగం, కార్తికంతో సమమైన మాసం లేవని కార్తిక పురాణం చెబుతోంది. అలాంటి మాసంలో వనభోజనం సంప్రదాయమైంది. పండుగలన్నిటి మూల సూత్రం ఆరోగ్యప్రాప్తే. ఆయా కాలాలకు అనుగుణమైన ఆచారాలను నిర్ణయించి, నిశ్చయించి, నిర్దేశించారు పెద్దలు. అనేక చెట్లున్న వనంలో దైవిక చర్చలతో చేసేదే వనభోజనం. ఈ ఆచారంతో విషయ జ్ఞానమూ, ఆధ్యాత్మిక చింతనా అలవడతాయి.
పవిత్రమాసంలో వనభోజనాలు
వర్షాకాలం ముగియగానే కార్తికం ప్రవేశిస్తుంది. వానలు, ఎండలు కాకుండా సమ శీతోష్ణ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తికమాస ప్రాశస్త్యం, ప్రాధాన్యం, ప్రభావాలను స్కాంద, పద్మ, బ్రహ్మవైవర్త పురాణాలు వివరించాయి. శివుడికీ, విష్ణువుకీ కూడా ప్రాముఖ్యత కలిగిన మాసమిది. ఉపవాసాలు, నిత్యార్చనలు; నిత్యాభిషేకాలు; దీప, వస్త్ర, యజ్ఞోపవీత, లింగ, ఫల, సాలగ్రామ, ధన, ధాన్య, తులసి, ఉసిరి, అన్నదానాలు; దీపారాధనలు, ఆకాశ దీప దర్శనాలు- ఇలా ఎన్నిటికో ఆలవాలం కార్తికమాసం. ఈ పవిత్ర మాసంలో వనభోజనాలకూ అంతే ప్రాముఖ్యముంది.
పండుగ వాతావరణం
వనభోజనంలో పులిహోర, దద్ధ్యోదనం, పెసర పప్పన్నం (పొంగలి), చక్రపొంగలి, గారెలు, పాయసం మొదలైన రుచులెన్నో ఉంటాయి. దోస, బీర, పొట్ల, గుమ్మడి, తోటకూర, బచ్చలి వంటి అనేక కాయగూరలుంటాయి. ఉసిరికాయ పచ్చడి తప్పనిసరి. ఇవన్నీ ఈ చలికాలానికి అనుకూలమైనవి, కాలుష్యాన్ని నివారించేవి. కట్టెలు లేదా పిడకల పొయ్యి మీద వంట చేయాలంటారు. వాటి నుంచి వచ్చే పొగ పీలిస్తే ఊపిరితిత్తుల వ్యాధులు రావు. పొగ మనకు ఆరోగ్యదాయిని, కీటక నాశిని. పెద్దల ఉద్బోధలు, పిల్లల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంటుంది.
వనభోజనం అంటే బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారితో కలసి ఆనందించే విందు. ఈ మాసంలో కార్తిక సోమవారం తదితర రోజుల్లో చేసే ఉపవాసాలూ, పిండివంటల వన భోజనాలూ కూడా ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించేవే. ఈ వేడుకతో సామాజిక సామరస్యం, సమైక్యత సిద్ధిస్తాయి. హనామి పేరుతో జపాన్‌లోనూ వనభోజన ఉత్సవం విరాజిల్లుతోంది. విహారం, వినోదం, ఆనందం, ఆహారం, ఆరోగ్యం, ఔషధం, ఆధ్యాత్మికత- అన్నీ ఒకచోట సమకూరే ఏకైక వేడుక వనభోజనం.





