News

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటి

196views

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి విషయంలో అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో విజయవాడ లో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని, దీనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించిన యువతకు నెలకు రూ. 3 వేలు సంభావనగా వారికి ఇచ్చేందుకు త్వరలోనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి ఆనం తెలిపారు.దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో రానున్న కార్తీకమాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ, వైష్ణవ క్షేత్రాలు, ప్రముఖ దేవాలయాల్లో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు, అభిషేకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాలకు భక్తులు ప్రత్యేకంగా ఈ నెలలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు రానున్నారని అన్నారు.