ArticlesNews

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్

14views

( అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి )

రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ ప్రజల మధ్యకు వెళ్లడం ప్రారంభించి, స్వాతంత్ర పోరాటంలో అగ్రశ్రేణి నేతగా ఎదిగి, స్వతంత్ర భారతావనిలో మొదటి హోమ్ మంత్రిగా రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా ఆధునిక భారత దేశ సమగ్రత సారథిగా చరిత్ర సృష్టించారు సర్దార్ పటేల్.

`సర్దార్’గా దేశ ప్రజలు ప్రేమతో పిలుచుకునే వల్లభాయ్ ఝవేర్‌భాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875 – డిసెంబర్ 15, 1950), భారత దేశ సమైక్యతను కాపాడటంలో 1871లో అనేక జర్మన్ రాష్ట్రాలను ఏకం చేసిన ఒట్టో వాన్ బిస్మార్క్‌తో పోలుస్తుంటారు. భారతదేశంలో సర్దార్ పటేల్ మొత్తం 562 రాచరిక రాష్ట్రాలను ఏకీకృతం కావించారు.

విధిలేని పరిస్థితులలో భారత్ ను వదిలి వెళ్ళవలసి రావడంతో తొలుత హిందూ- ముస్లిం విబేధాలు సృష్టించి, మతం ఆధారంగా దేశాన్ని రెండు ముక్కలు చేసిన బ్రిటిష్ పాలకులు జూన్ 3 నాటి ప్రణాళిక ప్రకారం, 565 కంటే ఎక్కువగా ఉన్న రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వాతంత్ర్యం ఎంచుకునే అవకాశం కల్పించారు.

ఈ ప్రాంతాలు భారత్ లో విలీనం కావడానికి అంగీకరించని పక్షంలో దేశంలో మూడో వంతు భూభాగం విడిగా ఉండిపోయి దేశమే ఛిన్నాభిన్నం కాగలదని భారత జాతీయ వాదులు అందరూ ఆందోళన చెందారు. ఈ ప్రాంతాలను భారత్‌లో విలీనం కావించి, దేశ సమైక్యతను కాపాడే బాధ్యతను ఆ సమయంలో ఉపప్రధానిగా ఉన్న పటేల్‌కు అప్పగించారు.

గాంధీ పటేల్‌తో, “రాష్ట్రాల సమస్య చాలా క్లిష్టంగా ఉంది, మీరు మాత్రమే దాన్ని పరిష్కరించగలరు” అని చెప్పారు. పటేల్‌ను ఆచరణాత్మక చతురతతో, చిత్తశుద్ధితో, ధృడ సంకల్పం గల రాజనీతిజ్ఞుడిగా అందరూ పరిగణించేవారు. భారతదేశ విభజనపై తనతో కలిసి పనిచేసిన సీనియర్ అధికారి విపి మీనన్‌ను రాష్ట్రాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిగా తనకు కుడి భుజంగా పనిచేయమని పటేల్ కోరారు.

ఆగస్టు 6, 1947న, పటేల్ ఆయా సంస్థానాధీశ్వరులతో సంప్రదింపులు ప్రారంభించారు. వారిని తన ఇంటికి విందు సమావేశాలకు ఆహ్వానిస్తూ సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశాల్లో, వారిలో దేశ భక్తిని ప్రేరేపిస్తూ, వారి ప్రయోజనాలకు – జాతీయ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

దేశ స్వాతంత్య్ర భాగస్వాములై ప్రజల భవిష్యత్‌ గురించి పట్టించుకునే బాధ్యతాయుతమైన పాలకులుగా వ్యవహరించాలని హితవు చెప్పారు. ముఖ్యంగా స్థానిక ప్రజల నుండి వారి పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో భారత రిపబ్లిక్ నుండి స్వతంత్రంగా మనుగడ సాగించడం అసాధ్యమని 565 మంది సంస్థానాధీశ్వరులు గ్రహించేటట్లు చేశారు.

వారి వారసుల కోసం రాజభరణాలు ఏర్పాటు చేయడంతో సహా సానుకూలమైన పలు నిబంధనలను ప్రతిపాదించారు. దేశభక్తితో వ్యవహరించమని పాలకులను ప్రోత్సహిస్తూనే సొంతంగా పాలనా సాగించలేరనే హెచ్చరికలు చేస్తూ, విలీన పత్రంపై సంతకాలు చేయడానికి ఆగస్టు 15, 1947 తుది గడువుగా స్పష్టం చేశారు.

పటేల్ వత్తిడితో జునాగఢ్ విలీనం
ఈ సమాలోచనలు ఫలితంగా కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారత్‌లో విలీనం పట్ల విముఖత వ్యక్తం చేశాయి. మిగిలిన వారందరూ విలీన పత్రాలపై సంతకాలు చేశారు. జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మాత్రమే పటేల్ ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం చేయలేదు.

తన సొంత ప్రాంతమైన గుజరాత్‌లోని జునాగఢ్ పటేల్‌కు చాలా ముఖ్యమైనది. పైగా, ఈ కతియావార్ జిల్లాలో అత్యంత సంపన్నమైన, 11వ శతాబ్దంలో గజనీ మొహమ్మద్ దోపిడీకి గురైన సోమనాథ్ దేవాలయం ఉంది. అందులోని విగ్రహాలను ధ్వంసం చేసి, అందులో గల అత్యంత విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

సర్ షా నవాజ్ భుట్టో ఒత్తిడితో నవాబు పాకిస్తాన్‌లో చేరాడు. అయితే ఇది పాకిస్తాన్‌కు చాలా దూరంలో ఉంది. దాని జనాభాలో 80 శాతం మంది హిందువులు. పాకిస్తాన్ చేరికను రద్దు చేసి, భారత్‌లో చేరాలని పటేల్ వత్తిడి చేయడంతో చివరకు విలీనం కాక తప్పలేదు

ఈ విషయమై పటేల్ తన ధృడ సంకల్పాన్ని ప్రదర్శించడం కోసం జునాగఢ్‌లోని మూడు సంస్థానాలను ఆక్రమించడానికి సైన్యాన్ని పంపాడు. విస్తృత నిరసనలు, పౌర ప్రభుత్వం లేదా ఆర్జీ హుకుమత్ ఏర్పడిన తరువాత, భుట్టో, నవాబ్ ఇద్దరూ కరాచీకి పారిపోయారు. పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం, పోలీసు విభాగాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

తర్వాత నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భారత్‌తో విలీనానికి 99.5 శాతం ఓట్లు వచ్చాయి. జునాగఢ్‌లోని బహౌద్దీన్ కళాశాలలో బహౌద్దీన్ కళాశాలలో చేసిన ప్రసంగంలో, పటేల్ హైదరాబాద్‌ తన తదుపరి లక్ష్యంగా ప్రకటించారు. కశ్మీర్ కంటే హైదరాబాద్ భారత్‌కు అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ విముక్తికై సైన్యం
అప్రమత్తం కానీ పక్షంలో హైదరాబాద్ ను కూడా జునాగఢ్ మాదిరిగా పటేల్ విలీనం చేసుకుంటారని గ్రహించిన పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకొందామంటూ వచ్చింది. జునాగఢ్‌లో వ్యవహరించిన విధంగా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్ విషయం తేల్చడానికి ఒప్పుకొంటే హైదరాబాద్ విషయంలో తలదూర్చమనే సంకేతం ఇచ్చింది.

హైదరాబాదు రాచరిక రాష్ట్రాలలో అతిపెద్దది. ఇది ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోని కొన్ని భాగాలతో ఉంది. దాని పాలకుడు, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం అయినప్పటికీ 80 శాతంకు పైగా ప్రజలు హిందువులు. నిజాం స్వాతంత్య్ర రాజ్యంగా కొనసాగించడమొ లేదా పాకిస్తాన్‌తో విలీనాన్ని కోరుకున్నాడు.

నిజాంకు విధేయులైన ముస్లిం శక్తులు, ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు, భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాలని నిజాంపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో హిందువులపై విస్తృతంగా దాడులు సాగించారు. యుద్ధాన్ని నివారించడానికి లార్డ్ మౌంట్‌బాటన్ తెగించి చేసిన ప్రయత్నాల కారణంగా యథాస్థితి ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, నిజాం ఒప్పందాలను తిరస్కరించాడు.

1948 సెప్టెంబరులో పటేల్ క్యాబినెట్ సమావేశాలలో భారతదేశం ఇక నిజాంతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దానితో ప్రధాని నెహ్రూ, గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి రాజీ పడి సైనిక చర్యకు ఒప్పుకోవలసి వచ్చింది. వ్యూహాత్మకంగా, నెహ్రూ ఐరోపాలో పర్యటిస్తున్నప్పుడు హైదరాబాద్‌పై దండయాత్ర చేయవలసిందిగా పటేల్ భారత సైన్యాన్ని ఆదేశించాడు.

ఈ చర్యను ఆపరేషన్ పోలోగా పిలిచారు. వేలాది మంది రజాకార్ బలగాలు హతమయ్యాయి. హైదరాబాద్ సురక్షితంగా భారత్‌లో విలీనమైంది. హైదరాబాద్‌ను భారతదేశం నడి బొడ్డున ఓ స్వతంత్ర దేశంగా కొనసాగడానికి అనుమతిస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ పడిపోతుందని, అప్పుడు దాని పరిధిలోని హిందువులు లేదా ముస్లింలు సురక్షితంగా ఉండరని పటేల్ పట్టుబట్టారు.

కశ్మీర్ కాపాడే ప్రయత్నం
సెప్టెంబరు 1947లో కశ్మీర్‌పై పాకిస్తాన్ దండయాత్ర ప్రారంభమైనప్పుడు, పటేల్ వెంటనే కశ్మీర్‌లోకి సైన్యాన్ని పంపాలనుకున్నాడు. కానీ, కశ్మీర్‌ను మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీన పరచేవరకు వేచి చూడాలని నెహ్రూ, మౌంట్‌బాటన్‌లు వత్తిడి తెచ్చారు.

అయితే, శ్రీనగర్, బారాముల్లా పాస్‌లను సురక్షితంగా ఉంచడానికి భారతదేశ సైనిక కార్యకలాపాలను పటేల్ పర్యవేక్షించారు. దళాలు ఆక్రమణదారుల నుండి చాలా భూభాగాలను తిరిగి పొందాయి. పటేల్, రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్‌తో కలిసి మొత్తం సైనిక ప్రయత్నాన్ని నిర్వహించారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సైనికులను కశ్మీర్‌కు తరలించడానికి, శ్రీనగర్ నుండి పఠాన్‌కోట్‌ను కలిపే ఒక ప్రధాన సైనిక రహదారిని ఆరు నెలల్లో నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం ఉండేందుకు ఏమాత్రం ఒప్పుకోవద్దని నెహ్రూకు పటేల్ స్పష్టం చేశారు.

శరణార్ధుల సమస్య
1949లో తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలోకి ప్రవేశించిన హిందూ శరణార్థుల సంఖ్య 800,000కి చేరుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. అనేక సందర్భాల్లో శరణార్థులను పాకిస్తాన్ అధికారులు బెదిరింపులు, హింసాయుత చర్యలతో బలవంతంగా తరిమికొట్టారు. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనమని నెహ్రూ పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌ను ఆహ్వానించారు.

అతనిపై విరక్తి ఉన్నప్పటికీ, పటేల్ అయిష్టంగానే ఖాన్‌ను కలుసుకుని ఈ విషయం గురించి చర్చించారు. రెండు దేశాల్లోనూ మైనారిటీ కమిషన్‌లను రూపొందించి, భారతదేశం, పాకిస్తాన్‌లు పరస్పరం మైనారిటీలను రక్షించుకోవడానికి నిబద్ధతతో కట్టుబడి ఉండేలా ఒప్పందంపై సంతకం చేయాలనే నెహ్రూ ప్రణాళికను పటేల్ తీవ్రంగా విమర్శించారు.

ఈ విషయమై నెహ్రు వైఖరికి నిరసనగా బెంగాల్‌కు చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, కె సి నియోగి కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. నెహ్రూ పాకిస్తాన్‌ను బుజ్జగిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌లో తీవ్రంగా విమర్శించారు. అయితే, ఆ ఒప్పందం ప్రమాదంలో పడడంతో పటేల్ నెహ్రూకు అండగా నిలిచారు.