ArticlesNews

సోదరి నివేదిత చరిత్ర మరువదు నీ ఘనత

254views

(అక్టోబర్ 28 – సిస్టర్ నివేదిత జయంతి)

మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుందని అంటారు సోదరి నివేదిత. విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, కేవలం భారతావని పై ప్రేమతో మన దేశానికి వచ్చి దీనజన సేవలో పునీరురాలైన వ్యక్తి సోదరి నివేదిత. స్వామి వివేకానంద ఆశయాలకు సోదరి నివేదిత సాకారంగా నిలిచారు కనుకనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద యోగి వంటి ఉద్దండులు నివేదితను లోకమాత నివేదిత అని సంబోధించారు.

సోదరి నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజిబెత్ నోబెల్. సామ్యూల్ రిచ్‌మండ్, మేరీ ఇసాబెల్ దంపతులకు 1876 అక్టోబరు 28న జన్మించారు. చిన్నతనం నుంచే కుశాగ్రబుద్ధి కలిగిన మార్గరెట్ తన 17వ ఏటనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మంచి బోధకురాలిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. అందరి అమ్మాయిల్లానే మార్గరెట్ సైతం వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలనుకుంది. వేల్స్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, అతడి ఆకస్మిక మరణం మార్గరెట్‌ను కృంగదీసింది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేది. ఈక్రమంలోనే 1895లో లండన్‌లో ఏర్పాటు చేసిన స్వామీ వివేకానంద వేదాంత ప్రసంగం కార్యక్రమానికి మార్గరెట్ హాజరు కావడంతో ఆమె జీవితం అసాధారణమైన మలుపు తిరిగింది. స్వామీ వివేకానంద ఉపదేశాలు, ప్రవచనాలు ఆమె ఆత్మను మేలుకొలిపాయి. భారతదేశానికి సేవ చేసే విధంగా ప్రేరేపించాయి.

వివేకానందులవారి పిలుపుతో 1898 జనవరి 28న మార్గరెట్ భారతదేశంలో అడుగుపెట్టింది. సముద్రమార్గంలో కలకత్తా చేరుకుంది. కలకత్తాలో 1898 మార్చి 11న నిర్వహించిన రామకృష్ణ మఠం ప్రారంభ సభలో స్వామి వివేకానంద తొలిసారిగా మార్గరెట్‌ను ప్రజానీకానికి పరిచయం చేశారు. అనంతరం శారదాదేవి ఆశీస్సులతో జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తానని ప్రతినబూనడంతో స్వామి వివేకానంద మార్గరెట్ పేరును ‘సోదరి నివేదిత’గా మార్చారు. నివేదితగా మారిన తర్వాత 1898 నవంబరు 11న నివేదిత ఓ బాలికల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. స్త్రీ విద్యావంతురాలైతేనే సంస్కారాలు పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తీసుకొచ్చి తన కుటుంబంలో సంస్కారాలు నింపడం ద్వారా జాతి భవిష్యత్తుకు పునాది వేయగలదని భావించిన వివేకానందుని ఆజ్ఞతో స్త్రీ విద్య ద్వారా స్త్రీ జనోద్ధరణకు నడుం కట్టింది. దీన దు:ఖితులను కన్నతల్లి వలె సేవిస్తూ భారతీయాత్మను మేలుకొలపడానికి అన్ని జీవన రంగాలకు సోదరి నివేదిత జీవం పోసింది.

విద్య, సేవా కార్యక్రమాలను అమలు చేస్తూనే సోదరి నివేదిత భారత స్వాతంత్ర్య సాధనే తన జీవన కార్యంగా స్వీకరించింది. ప్రసిద్ధ విప్లవ సంస్థ అనుశీలన సమితికి నివేదిత మార్గదర్శనం చేసింది. బ్రిటిష్ రాక్షస పాలనను చీల్చి చెండాడుతూ అనేక పత్రికలకు వ్యాసాలు రాసింది. స్వదేశీ-స్వభాష పట్ల భారతీయులకు మార్గదర్శనం చేసింది. భారతీయ కళలకు ప్రాణం పోయడంలో నివేదిత కృషి మరువలేనిది. మన శాస్త్రవేత్తలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పొంపొందించింది. డాక్టర్ జగదీశ్ చంద్రబోస్ ఆవిష్కరించిన పరిశోధనలు బ్రిటన్‌లో అవమానానికి గురైనప్పుడు నివేదిత ఆయన వైపు నిలబడింది. కొత్త పుస్తకాలు రచించమని ప్రోత్సహించి వాటి ముద్రణకు కావాల్సిన ధన సహాయాన్ని అందించింది. భారతీయ బాలలపై విదేశీ ఆదర్శాలు రుద్ద రాదని, వారి వారి భాషల ద్వారా జాతీయ ఆదర్శాలు వారిలో నింపాలని నివేదిత అనేవారు. భారతీయ కళలకు ప్రాణం పోయడంలో కూడా నివేదిత విశేష కృషి చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి వారికి ప్రేరణగా నిలిచింది. భారతీయుల ఆత్మను మేలుకొలుపుతూ ఎన్నో రచనలు చేసింది. వీటిలో “ది వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్”, “స్టడీస్ ఫ్రమ్ద ఏన్ ఈస్ట్రన్ హోమ్” ముఖ్యమైనవి. నివేదిత రచించిన “కాళీ: ది మదర్” స్ఫూర్తితోనే అవనీంద్రనాథ్ ఠాగూర్ ‘భారతమాత’ను మానవరూపంలో చిత్రీకరించాడు. సోదరి నివేదితను స్ఫూర్తిగా తీసుకుని మన మనస్సు, బుద్ధి, చేతనతో భారతమాతకు అంకితం కావాలి. ఇదే మన సోదరి నివేదితకు మనం అందించే నిజమైన నివాళి.