
పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. రాజమహేంద్రవరం బస్ స్టేషన్‌లో ఈ మేరకు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ మాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే సర్వీసు.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట పుణ్యక్షేత్రాలను కార్తిక సోమవారం రోజున దర్శించుకుని, అదే రోజు రాత్రి 8 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందని వివరించారు. ఈ సర్వీసులు నవంబర్ 3, 10, 17, 24, డిసెంబర్ ఒకటిన అందుబాటులో ఉంటాయన్నారు. బస్టాండ్లు, ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వేషన్ చేయించుకోవచ్చన్నారు. శబరిమలైకు కూడా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికీ ఐదు రోజుల యాత్రకు రూ.5 వేలు, వారం రోజుల యాత్రకు రూ.6 వేలు, పది రోజుల యాత్రకు రూ.7,500 టికెట్ ధర నిర్ణయించామన్నారు. వీటికి సంబంధించిన బ్రోచర్లు, పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ షేక్ షబ్నం, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.





