
అల్లూరి సీతారామరాజు జిల్లా: వనవాసుల సేవే నిజమైన సమాజ సేవ అనే సందేశాన్ని చాటుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమాని శ్రీపూజ -ఐఏఎస్ తన జన్మదినాన్ని వనవాసి విద్యార్థులతో కలిసి సాదాసీదాగా, ఆప్యాయ వాతావరణంలో జరుపుకున్నారు.
మఠం వనవాసి కళ్యాణ్ ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజతో పాటు ఆమె భర్త, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆదిత్య వర్మ -ఐఏఎస్ పాల్గొన్నారు. ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులతో ఎంతోసేపు మమేకమై వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించి, సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ మాట్లాడుతూ, తన జన్మదినాన్ని వనవాసి చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. వారి మధ్య గడిపిన సమయం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆశ్రమ నిర్వాహకులు, విద్యార్థులు జాయింట్ కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వనవాసి విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని నిర్వాహకులు అభినందించారు.





