News

రాజకీయాలకు అతీతంగా భారతీయ కిసాన్‌ సంఘ్‌

254views

రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై స్పందించడంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) ముందుంటుందని బీకేఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీధర్‌రెడ్డి అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని లయన్స్‌క్లబ్‌ కమ్యూనిటీ హాలులో బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి అధ్యక్షతన భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) కాకినాడ జిల్లా ప్రతినిధుల మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన బీకేఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు తావు లేకుండా రైతులు సంఘటితం కావలసిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామాలలో ఉన్న రైతులను సంఘటిత పరచి, ప్రతీ రైతు బీకేఎస్‌లో సభ్యత్వం కలిగి ఉండేలా సభ్యులు కృషి చేయాలని ఎం.శ్రీధర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు పరిమి వెంకట రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యల్లపు సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.పతిరాజు తదితరులు రైతులకు దిశానిర్దేశం చేశారు.

ఈ మహాసభలో ప్రధానంగా ఐదు అంశాలను తీర్మానించారు. భూ రీసర్వేలో అనేక లోపాలుండడం వల్ల ఈసర్వేను రద్దు చేయాలని, గత నెలలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారాన్ని అందించాలని, వరి కోతల సమయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని, జిల్లాలో ఉన్న కాలువలు, చెరువులలో పూడిక తీయించి, అధునీకరించాలని, రైతులకు ఇబ్బందులు కలిగించని విధంగా, అవకతవకలకు తావు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ బీకేఎస్‌ జిల్లా మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

కాగా భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడికి చెందిన రాసంశెట్టి రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రతినిధుల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా గట్టి అశోక్‌ (పిఠాపురం), ఉపాధ్యక్షుడిగా నీలగిరి చిట్టిబాబు (కిర్లంపూడి మండలం వేలంక గ్రామ మాజీ సర్పంచ్‌), కోశాధికారిగా కంపరపు నాగేశ్వరరావు (చిల్లంగి), కార్యవర్గ సభ్యులుగా జాజిమొగ్గల ఈశ్వరరావు (కోలంక), పెదిరెడ్ల గంగారావు (ధర్మవరం), రాయపురెడ్డి సత్యరఘురామ చక్రవర్తి (కాజులూరు), కాకిలేటి వీర్రాజు (సింహాద్రిపురం), మాసిన రామసాయి (వేట్లపాలెం), కుంచే నాగేశ్వరరావు (తిరుపతి)లు ఎన్నికయ్యారు. మహాసభ అనంతరం నూతన కార్యవర్గాన్ని బీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరిమి వెంకట రాఘవులు ప్రకటించారు.