
జాతీయ సమైక్యత, సమగ్రతకు యువత ప్రత్యేకంగా పాటుపడాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడా మంత్రిత్వ శాఖ,గుంటూరు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాశ్మీర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని వీసీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జాతీయ సమగ్రత పెంపొందించడంలో యువతదే కీలకపాత్ర అన్నారు. దేశంలోని సాంస్కృతిక, పారిశ్రామిక, చారిత్రక, పర్యాటక విద్యాపరమైన ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఈ యువ సమ్మేళనం వల్ల కలుగుతుందని తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాశ్మీర్ యువతలో జాతీయ ఐక్యత, సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ వివిధ అంశాలపై వర్క్‌షాప్‌లతోపాటు రెండు రోజుల క్షేత్ర స్థాయి సందర్శనలతో కార్యక్రమం జరగనుందని వివరించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, ఓఎస్‌డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, విశాఖపట్నం జిల్లా నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ జి. మహేశ్వరరావు ప్రసంగించారు. కాశ్మీరీ యువత సాంస్క్కతిక ప్రదర్శనతో సందడి చేశారు.





