News

దేవుడ్ని ప్రార్థించా..అయోధ్య కేసు అనుభవాలు పంచుకున్న సీజేఐ

230views

దేవుడి దయ వల్లే అయోధ్య సమస్య పరిష్కారం అయ్యిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కష్టతరమైన కేసులను పరిష్కరించాల్సిన అవసరం తరుచూ వస్తూ వుంటుందని,ఆ కోవలోనిదే రామజన్మభూమి కేసు కూడా అని అన్నారు. తన స్వగ్రామమైన పూణెలోని కన్హేర్ సర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్థులతో ముచ్చటిస్తూ… అయోధ్య కేసు విషయాలను పంచుకున్నారు.

‘‘అయోధ్య కేసు మూడు నెలల పాటు నా దగ్గర కొనసాగింది. ఇది అత్యంత సున్నితమైన విషయం. ఈ వివాదానికి సరైన పరిష్కారం చూపించమని నేను దేవుని ముందు కూర్చొని ప్రార్థించా. దేవుడ్ని అభ్యర్థించా. ఈశ్వరుడి దయవల్లే అయోధ్య సమస్య పరిష్కారం అయ్యింది. అయితే దేవుడిపై విశ్వాసం వుండాలి. దేవుడు ఎల్లప్పుడూ ఓ మార్గాన్ని చూపిస్తూనే వుంటాడు.’’అని డీవై చంద్రచూడ్ అన్నారు.అయోధ్య కేసు చాలా సంక్షిష్టమైందని, అయితే విశ్వాసం, అంకితభావంతో దీనిని పరిష్కరించామని సంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కారాలను చూపడం, కేసులను పరిష్కరించడం న్యాయవ్యవస్థ పని అని, అయితే కొన్ని సార్లు ఇందులో విశ్వాసం కూడా పాత్ర పోషిస్తుందన్నారు. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దీనికి ప్రత్యక్ష తార్కాణమని, సున్నితమైన విషయం అయినా.. న్యాయవ్యవస్థ న్యాయమైన తీర్పునిచ్చిందన్నారు.

2019, నవంబర్ 9 న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగుమం చేసింది. ఈ ఐదుగురితో కూడిన ధర్మాసనంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా వున్నారు.