
(అక్టోబర్ 18 – విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి)
సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను తమ రచనలలో పొందుపరచి వాటిని సమాజంలోని మార్పులకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగించేవారు. అటువంటి గొప్ప గుణాలు, లేక ధర్మాలు కలిగిన అతి కొద్ది మంది రచయితలలో, సమాజ జీవన పరిస్థితులను నిర్మొహమాటంగా వివరిస్తూ, వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి మన విశ్వనాథ సత్యనారాయణ గారు.
20వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యానికి ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు పెద్ద దిక్కు. కవిత్వం, కథలు, నవలలు, నవలికలు, వ్యాసాలు, నాటకాలు, ప్రసంగాలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల ప్రక్రియల్లోనూ శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు రచనలు చేశారు. సాహితీ ప్రపంచంలో ఈ మహానుభావుడు చేయి వేయని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. చరిత్ర, ఆధ్యాత్మికత, సాంఘిక, రాజకీయ, భాష, మనస్తత్వ శాస్త్రం, ప్రాచీన గ్రంథ సంబంధితం..ఇలా అనేక విషయాలు, అంశాల గురించి తన రచనలను కొనసాగించారు. తెలుగు సాహిత్య వనంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు సాహితీవేత్త శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారే. కవిసామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, డాక్టరేటు..ఇవి వీరు సాధించిన, వీరికి బహుకరించిన కొన్ని గొప్ప అవార్డులు.
విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబరు 10 మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లోను పై చదువులు బందరు పట్టణంలో సాగాయి. బందరు హైస్కూల్‌లో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం విశ్వనాథ సత్యనారాయణ గారి అదృష్టం. బి.ఎ. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మాగాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు.
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్న కథాకలితార్థయుక్తి. విశ్వనాథ రచనల్లో అతని పాండిత్యమే కాక రచనా శిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. ప్రజలకు నిజమైన సాహితీ చైతన్యాన్ని రుచి చూపించాలని, కొంత వరకైనా భాషా సాహిత్యాన్ని ఉన్నత స్థితికి లాగాలని తపనపడ్డారు. సాహితీ సముద్రంలో విశ్వనాథునికి ముందు, విశ్వనాథుని తరువాత అనే విధంగా తన పాండిత్య పటిమతో సమాజంలో పెను సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ విరచిత వేయి పడగలులో ధర్మారావు పాత్ర నేటికీ నిత్య నూతనం. ఈ నవలలో హిందువుల వివాహం, కుటుంబ వ్యవస్థ, ప్రకృతి ఆరాధన మొదలైన వాటిమీద జరుగుతున్న పరిణామాల్లో వస్తున్న విలువల సంక్షోభం గురించి, గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను, వివిధ వాదాల మీద తన ప్రతిస్పందననూ మహనీయంగా చిత్రించారు. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో అవసరం అని విశ్వనాథుల వారు అనేవారు. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవారు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనేవారు.
విశ్వనాథ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ఉన్న భారతీయ ధర్మం మాత్రమే ఏ కాలానికి అయినా మానవజాతికి ఆదర్శమని, అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. తన జీవితాన్ని, సాహిత్యాన్ని భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన ఈ సాహిత్య మణిమంజరి 1976 అక్టోబరు 18 నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి నాడు భగవంతునిలో ఐక్యం అయ్యారు. విశ్వనాథుల వారి స్ఫూర్తితో యత్ర విశ్వం భవిత్యేక నీడమ్ అన్న అర్ష భావనలు ప్రపంచమంతటా పరివ్యాప్తమై అందరిలోనూ విశ్వమానవ సౌభ్రాత్ర భావన అంకురిస్తుందని ఆశిద్దాం.





