ArticlesNews

దైవిక శక్తులు నిండిన పూర్ణిమ

283views

నేడు ఆశ్వయుజ పూర్ణిమ

ఆశ్వయుజ పూర్ణిమ చాలా ప్రత్యేకమైంది. దైవిక శక్తులు నిండి ఉన్న ఈ రోజున అమ్మవారి ఆలయాల్లో ఆరాధనలు వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ పూర్ణిమ లక్ష్మీ దేవి జన్మ తిథి అని పురాణాలు చెబుతున్నాయి. అంటే సాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది, ఆ దేవి భూలోకంలో అడుగుపెట్టి, మానవాళిని అనుగ్రహించింది ఆశ్వయుజ పూర్ణిమనాడే అన్నది పురాణవచనం. తక్కిన మాసాల్లో వచ్చే పూర్ణిమ కంటే ఈ రోజున చంద్రుడు వెన్నెల రూపంలో మరింత అమృతాన్ని కురిపిస్తాడని పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజు పాలను కొంతసేపు వెన్నెలలో ఉంచి ఆనక సేవిస్తారు.

ఆశ్వయుజ పూర్ణిమనాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. విష్ణువును పూజించటం కూడా శ్రేష్టం. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, అవకాశం ఉంటే ప్రవహించే నీటిలో లేదంటే ఇంట్లోనైనా గంగాదేవి మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పౌర్ణమినాడు నువ్వులు సమర్పించడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఈరోజు పారే నీటిలో నువ్వులను అర్ఘ్యమివ్వడం చాలా మంచిది. తర్వాత విష్ణుమూర్తికి షోడశోపచార పూజ చేయాలి. విష్ణు సహస్రనామాలు పఠించి, పూలూ పండ్లతో పాటు ఆ స్వామికి ఇష్టమైన పసుపురంగు వస్త్రాలు సమర్పించాలి.