News

ముగిసిన బన్ని ఉత్సవాలు

371views

రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలు బుధవారం ముగిశాయి. దేవరగట్టులో కంకణ విసర్జన అనంతరం కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవ మూర్తులకు ఆలయ పూజార్లు మహామంగళారతి, అభిషేకలు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొరవయ్యలు విగ్రహాలను, పల్లకీని భక్తి శ్రద్ధలతో నెరణికి గ్రామానికి మోసుకెళ్లారు.

నెరణికిలో దసరా వేడుకలు
విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో పండుగ వాతవరణం నెలకొంది. విజయదశమి రోజు కాకుండా బన్ని ఉత్సవాలనంతరం ఈ గ్రామంలో దసరా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దేవరగట్టు నుంచి గ్రామానికి చేరిన విగ్రహాలను ఆంజనేయస్వామి ఆలయం ముందు కొలువుంచి మహామంగళ హారతి, ఇతర పూజలు చేశారు. తర్వాత గ్రామస్తులు ఆలయం నుంచి విగ్రహాలను అర్చకుల ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిన్నారులు ‘బన్ని’ (కర్రలు పట్టుకుని ఎగరడం) ఆడారు. మాళమల్లేశ్వరుని కంకణధారణ నుంచి నిష్టతో ఉన్న గ్రామస్తులు ఉత్సవాల ముగింపుతో దీక్షను విరమించారు. బన్సి ఉత్సవం సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య నేతృత్వంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. అలాగే ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.